ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలకు కనువిప్పు కలిగేలా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయతో చెరువులు, కాళేశ్వరం నీళ్లతో బీడువారిన పొలాలు కళకళలాడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయా లు రైతుల ఉసురుపోసుకునేలా ఉన్నాయన్నారు. సోమవారం చేపట్టే నిరసనలకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ తదితరులున్నారు.
అన్నదాతలకు అండగా నిలుద్దాం
గంభీరావుపేట, డిసెంబర్ 19: యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన హామీ వచ్చేదాకా అన్నదాతలకు అండగా నిలుద్దామని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నల్ల జెండాలు, బ్యాడ్జీలతో గ్రామగ్రామాన నిరసనలు చేపట్టి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం వైఖరికి నిరసనగా పల్లెల్లో సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు. ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, విండో చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, వైస్ ఎంపీపీ దోసల లత, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అహ్మద్, పట్టణాధ్యక్షుడు పెద్దవేని వెంకటియాదవ్, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మోతె రాజిరెడ్డి, కమటం రాజేందర్, నాయకులు లక్ష్మణ్, దయాకర్‌రావు, సురేందర్‌రెడ్డి, రాజారాం, రామాంజగౌడ్, యాదిలాల్, రాజు, నాగరాజు గౌడ్ తదితరులున్నారు.
నిరసనను విజయవంతం చేయండి
బోయినపల్లి, డిసెంబర్ 19: కేంద్రం వైఖరిపై మండల వ్యాప్తంగా చేపట్టే నిరసనలను విజయ వంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఓ ప్రకటనలో కోరారు. సర్పంచులు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.