ఇన్నాళ్లూ వామపక్ష వాదినంటూ ఈటల గొప్పలు
ఇన్నాళ్లూ వామపక్ష వాదినంటూ ఈటల గొప్పలు
ఇప్పుడేమో రాజకీయాల్లో లెఫ్టిజం, రైటిజం ఉండవంటూ నిస్సిగ్గుగా బుకాయింపు
అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టే అందులోకి వెళ్లానని సమర్థన
దళిత బంధుపై ద్వంద్వ వైఖరి పథకం ఎందుకంటూ అక్కసు
బయటపడుతున్న రాజేందర్ అసలు రంగు మండిపడుతున్న ప్రజలు
కరీంనగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ నేత ఈటల అసలు రంగు తెలుస్తున్నది. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది. ఇన్నాళ్లూ తనది లెఫ్టిజం అంటూ చెప్పుకున్న ఆయన.. ఇప్పడు రాజకీయాల్లో లెఫ్టిజం, రైటిజాలంటూ ఉండవని నిసిగ్గుగా బుకాయించడం నిజస్వరూపాన్ని బయటపెడుతున్నది. అక్కడితో ఆగకుండా బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టే అందులోకి వెళ్లానని చెప్పడం.. ఆయన స్వార్థ రాజకీయాలకు అద్దం పడుతున్నదని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానీకం మండిపడుతున్నది. అంతేకాదు, దళితబంధుపై మరోసారి అక్కసు వెల్లగక్కడం.. దళితజాతి పేదరికంలో ఉందని సీఎం తనతో చాలాసార్లు చెప్పారంటూనే.. పథకం ఎందుకంటూ ప్రశ్నించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నిప్పులు చెరుగుతున్నది.
ఇన్నాళ్లూ బీజేపీ కాలగర్భంలో కలసి పోయే పార్టీ అంటూ తూర్పార పట్టిన రాజేందర్, ఇప్పుడు మాట మార్చారు. అంతేకాదు గతంలో తాను వామపక్షవాదినంటూ చెప్పుకున్నారు. తీరా ఇప్పడేమో రాజకీయాల్లో అటువంటివి ఉండవని చెబుతున్నారు. అంటే, ఇంతకుముందు చెప్పినదంతా అబద్ధమేనా..? అలా చెప్పుకోవడం వెనుక ఆంతర్యమేంటి? లెఫ్టిజం భావాలున్నాయని నమ్మి ఇన్నాళ్లూ ఆయన బాటలో నడిచిన వారి పరిస్థితి ఏంటి? ఎవరిని నమ్మించడానికి ఈ మాటలు చెప్పారు? ఇప్పటికిప్పుడే ఎందుకు మాట మార్చారో చెప్పాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. అంతే కాదు.. అధికారంలోకి వచ్చేది బీజేపీనేని, అందుకే అందులోకి వెళ్లానంటూ చెప్పడం ఆయనకు ఉన్న పదవీకాంక్షను చాటుతున్నది. బీజేపీకి పుట్టగతులుండవని, కాంగ్రెస్ మాదిరిగానే ఖతం అవుతుందంటూ ఇదే హుజూరాబాద్ గడ్డపై నుంచి శాపనార్థాలు పెట్టిన ఆయనే, ఇప్పుడు ఆ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని బయట పెడుతున్నది. అంతేకాదు అవసరానికి తగిన విధంగా సిద్ధాంతాలు మార్చుకోవడం.. పదవుల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం.. ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి దేనికైనా వెనుకాడక పోవడం రాజేందర్ సహజశైలి అని, అదే అసలైన అతని నిజ స్వరూపమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దళితబంధుపై ద్వంద్వ వైఖరి
ఈ దేశంలో కడు పేదరికంతో బతుకుతున్నది దళిత జాతియే అని సీఎం కేసీఆర్ నోటి నుంచే వందల సార్లు విన్నాను. ఇందుకోసం అవసరమైతే దళిత చైతన్యయాత్ర పెడుదామన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ అణగారిన వర్గాలకు నిల యం, నూటికి 85 శాతం ప్రజానీకం ఈ జాతులు మాత్రమే అని సీఎం చెప్పారంటూ రాజేందర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అంటే దళిత జాతి పేదిరకంలో ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వీటితోపాటు అణగారిన వర్గాలకు బాసటగా నిలువాల్సిన అవసరం ఉందన్న విషయం గతంలోనే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రాజేందరే స్వయంగా ఒప్పుకుంటున్నారు. మళ్లీ దళిత బంధుపై ద్వంద్వ వైఖరి చాటుతున్నారు. అదే పేదరికాన్ని పారదోలేందుకు.. దళిత జాతిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా స్వశక్తులను చేసేందుకు.. బ్యాంకులతో లింకేజీలు లేకుండా కుటుంబానికి 10 లక్షలను దళిత బంధు పథకం కింద ఇవ్వడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే కడుపుమంట ఎందుకని దళిత మేధావులు ప్రశ్నిస్తున్నారు. దళిత బంధును హుజూరాబాద్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టాలంటూ ఈటల మరోసారి అక్కసు వెల్లగక్కారు. 17 ఏండ్ల రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తమపై ఎందుకింత అసహనం అని హుజూరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాదు దళితుల్లో పేదరికం ఉందని, అవసరమైతే దళిత చైతన్యయాత్ర చేద్దామని సీఎం చెప్పినట్లు మీరే చెబుతున్నారు కదా..! అంటే ముఖ్యమంత్రి మా సంక్షేమం గురించి ముందు నుంచీ ఆలోచనలు చేస్తున్నట్లే కదా..! మీరు పార్టీలో ఉన్నప్పుడే సీఎం మా సంక్షేమం కోసం తపన పడ్డట్లు మీ మాటల్లోనే తెలుస్తున్నది కదా..? మరి దళితబంధు పథకం ద్వారా మాకు డబ్బులు ఇస్తుంటే.. ఇప్పుడే పథకం ఎందుకు పెట్టారంటూ మీరెలా ప్రశ్నిస్తారని దళితబిడ్డలు నిప్పులు గక్కుతున్నారు. నీ రాజకీయ స్వార్థం కోసం దళిత బంధును ఆపేందుకు చేస్తున్న కుట్రలు, ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయించడం.. కోర్టుల్లో కేసులు వేయించడం గమనిస్తున్నామని, ఇకనైనా దళిత బంధుపై ద్వంద్వ వైఖరిని వీడాలని హెచ్చరిస్తున్నారు.
అంత భయమెందుకో..
టీఆర్ఎస్కు డిపాజిటే రాదంటూ రాజేందర్ మాట్లాడిన తీరుపై హుజూరాబాద్ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంత నమ్మకముంటే ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తే నీకేంటి? నీవు విస్మరించిన, చేయని ఎన్నో అభివృద్ధి పనులు ప్రభుత్వం చేస్తుంటే.. ఎందుకంతా అక్క సు వెల్లగక్కుతున్నావు? నిజంగానే నీవు గెలుస్తవనే నమ్మకముంటే.. గడియారాలు, కుట్టు మిష న్లు, కుక్కర్లు, వాష్మిషన్లు వంటి నజరానాలు ఎందుకు పంపిణీ చేస్తున్నావు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల నీవు ఇవ్వాలనిజూసిన నజరానాలను పట్టుకొని నేలకొసి కొట్టినం కదా అయినా తెలుసుకోలేకపోతున్నావు. గొర్రెలు ఇస్తే నీకు కండ్లమంట ఎందుకు? దళిత బంధు ఇస్తే ద్వంద్వ వైఖరెందుకు? అని ప్రశ్నిస్తున్నా రు. ఓటమి ఖాయమన్న విషయం తెలిసే ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటున్నారు ప్రజలు. ఆయన స్వార్థం కోసమే ఎన్నికలు తెచ్చి.. ఇప్పుడు గెలిచేందుకు పచ్చి అబద్ధాల ముచ్చట్లు చెబుతూ.. ఏదో విధంగా పక్కదారి పట్టించే కుట్రలకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు.
మాకు గొర్రెలు రానియ్యలే..
ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి.. పోయినయి గాని ఏ ఒక్క నాయకుడు గొల్ల, కుర్మలను పట్టించుకోలే. బతుకుదెరువు చూపలే. ఇన్నేండ్లకు మాకు మంచిరోజులు అచ్చినయ్. కానీ ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న ఈటల మా మీద కక్షగట్టిండు. మొదటి దఫా గొర్రెలు మాకు రాకుండా చేసిండు. కానీ ప్రభుత్వంల కెళ్లి బయటకుపోయిన తర్వాత రెండో విడతలో సీఎం కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండు. మా గొల్ల కుర్మలందరం టీఆర్ఎస్తోనే ఉంటం.
ఈటలవి అన్నీ అట్టి ముచ్చట్లే..
ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడు మస్తు చెప్పిండు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తా అన్నడు. ఇంకా బాగానే చెప్పిండు. కానీ ఏదైనా చేసిండా..? ఏం చేయలే. మాకు ఏం మేలు చేయలే. అన్నీ అట్టి ముచ్చట్లే. ఆయన ఆస్తులు పెంచుకున్నడు గాని అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలే. ఆసలు నీకు ఎందుకు ఓటెయ్యాలె. ఇయ్యాళ బీజేపీలోకి పోయి నీతి మాటలు మాట్లాడవడితివి. మా కోసం పోయినవా బీజేపీలకు. నీ ఆస్తులు కాపాడుకునేందుకు పోయినవు.