పేదలపై భారం పడకూడదనే ఏర్పాటు
కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానలో పెరిగిన డెలివరీలు
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
మంత్రి గంగుల కమలాకర్
విద్యానగర్, ఆగస్టు 19: తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సీటీ స్కాన్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పేదల ప్రజలపై భారం పడకూడదనే ఈ యంత్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేసీఆర్ కిట్లతో పాటు ప్రోత్సాహకాలతో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌తో పాటు వార్డును ప్రారంభించారు. అనంతరం దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సిటీస్కాన్ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కొనసాగుతాయని, వచ్చే నెల 1 నుంచి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లో కొనసాగిస్తామన్నారు. దీని కోసం రేడియాలజిస్టుతో పాటు అసిస్టెంట్‌ను తీసుకుంటామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేనివారు రూ.500లు చెల్లించాలన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేల ప్రోత్సాహాలతోపాటు కిట్లను అందిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 34,001 ప్రసవాలకు 29,987 మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ఆడ శిశువులకు 16,262 మందికి రూ.13 వేలు, మగ శిశువులకు 13,725 మందికి రూ.12 వేలు అందజేశామన్నారు. ఇందుకోసం రూ.10 కోట్లకు పైగా నిధుల్ని ప్రభుత్వం ఖర్చు చేయడం సంతోషంగా ఉందన్నారు.
గతంలో మార్చురీ వైపు రోడ్డుపై ఉపాధి పొందిన వారు స్మార్ట్ సిటీ రోడ్ల విస్తరణతో ఇబ్బందులు పడ్డారని, వారికి పునరావాసం కల్పించడానికి సెట్ బ్యాక్ స్థలంలో మున్సిపాలిటీ ద్వారా వెండింగ్ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. రోగి బంధువులకు నిర్మించే విశ్రాంతి గది కోసం ఎమ్మెల్యే నిధుల్లోంచి గతంలోనే రూ.కోటి కేటాయించామని, అదనపు నిధులను సైతం సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్, దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వసంత్‌రావు, ఏవో నజీముల్లాఖాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, వైద్యులు కనకం శ్రీనివాస్, రవీందర్, కుమార్, ధన్‌రాజ్, వసీం, నవీన, మంజుల, అభివృద్ధి కమిటీ సభ్యులు కేశవరెడ్డి, జడ్పీటీసీ పిట్టల కరుణ, హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఫార్మసిస్టు భారతి, ఆకుల ప్రభాకర్, రజిత, నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ రమాబాయి, నర్సింగ్ సూపరింటెండెంట్లు అంజమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.