పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 18: జిల్లాలో ప్రగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలను శనివారం నిర్వహించారు. ఫైనాన్స్, ప్లానింగ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యం పనులపై సంబంధిత అధికారులతో మధూకర్ చర్చించి పురోగతి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడా రు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని వివరించా రు. జడ్పీ నుంచి అందిన నిధులను సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను మరింత పెంచాలని, తడి, పొడి చెత్తను వేరు చేస్తూ డంప్ యార్డులకు తరలించాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బండారి రాంమూర్తి, తిరుపతిరెడ్డి, శారద నారాయణ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, దివాకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.