కోర్టు చౌరస్తా, డిసెంబర్ 18: బాలలపై నమోదైన కేసుల్లో పోలీసులు, న్యాయమూర్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్, మెంబర్స్ ఆఫ్ అసిస్టెంట్ జువైనల్ పోలీస్ యూనిట్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల నేరప్రవృత్తికి మొదట తల్లిదండ్రులు, తర్వాత సమాజం, పరిసర ప్రాంతాలే కారణమని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో అనాథ పిల్లలపై చైల్డ్ వెల్ఫేర్ సంస్థలకు అంతే బాధ్యత ఉంటుందని సూచించారు. బాలలపై నమోదైన కేసు విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు వారి హకులకు భంగం కలుగకుండా చూడాలన్నారు. బాల నేరస్తుల పేర్లు, ఫొటోలు మీడియాలో చూపిస్తే నేరమని తెలిపారు. జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి అర్పితారెడ్డి మాట్లాడుతూ, బాలనేరస్తుల సంరక్షణ చట్టం గురించి వివరించారు. న్యాయమూర్తులు మాధవీకృష్ణ, సతీశ్‌కుమార్, కంచె ప్రసాద్, అరుణ, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ తదితరులు పాల్గొన్నారు.