పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉపాధ్యాయులు
ప్రాధాన్యతా క్రమంలో తప్పులు దొర్లాయని వినతులు
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 18 : కరీంనగర్ డీఈవో కార్యాలయంలో శనివారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ నిన్నటి వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో అధికారులు గురువారం రాత్రి వరకు ఆప్షన్లు, మెడికల్ సర్టిఫికెట్లు, అభ్యంతరాలు స్వీకరించారు. అయితే, సీనియారిటీ జాబితాపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాధాన్యతాక్రమంలో తప్పులు దొర్లాయని, సవరించాలని పెద్దసంఖ్యలో కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందిస్తున్నారు. అయితే, ఆప్షన్ల ప్రకియ శుక్రవారంతో ముగియగా, శనివారం జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ప్రత్యేకాధికారి జేడీ శ్రీనివాసాచారి, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఈవో జనార్దన్‌రావు ఆధ్వర్యంలో జోనల్ విధానంపై ఆన్లైన్ నమోదు ప్రకియ చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలు పరిష్కారం కాకుండా పోస్టింగ్‌లు ఎలా కేటాయిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ, ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పులు దొర్లితే సవరించేందుకు సిద్ధమని ప్రకటించారు.