కార్పొరేషన్, డిసెంబర్ 18: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 42వ డివిజన్లో రూ. 22 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం 40 డివిజన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో దశలవారీగా అభివృద్ధి పనులను ప్రారంభించి, త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో స్మార్ట్‌సిటీ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టవర్‌సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యం చేస్తున్నందున సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చామని, త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేచినేని వనజ-అశోక్‌రావు, గంట కళ్యాణి, భూమాగౌడ్, ఆయా కాలనీల ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.