ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
శంకరపట్నం సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
శంకరపట్నం, డిసెంబర్ 18: ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి పనుల్లో అలక్ష్యం వీడాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, గ్రామాల్లో రైతు బజార్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో నూరు శాతం లక్ష్యంతో పనిచేయాలన్నారు. అభివృద్ధి పనులకు పలువురు సర్పంచులు తీర్మానాలు ఇవ్వడం లేదని ఏపీవో శారద ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తీర్మానాలు ఇవ్వని సర్పంచుల చెక్కు లు ఆపి బిల్లులు నిలుపుదల చేయాలని ఎంపీడీవో జయశ్రీని ఆదేశించారు. దళితుల గృహావసరాలకు 100 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మరిందని పేర్కొంటూ, రైతులు యాసంగిలో ఎవరూ వరి వేయొద్దని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని గుర్తించాలన్నారు. బయట కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న రైతులు వరి పంట వేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇతర పంటల వినియోగానికి రెండు, మూడు రోజుల్లో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు విడిచే అవకాశం ఉందన్నారు. ప్రతీ జీపీలో ఒక రోజు ఉండి అభివృద్ధి పనులు సమీక్షిస్తానని చెప్పారు. 2 నెలల్లో వారసంతలు నిర్మాణాలు పూర్తవ్వాలని, ఈ మేరకు తహసీల్దార్ గ్రామకంఠం పరిధులు నిర్ణయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.