పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్
మానేరు వంతెనపై విగ్రహానికి నివాళి
పాల్గొన్న మేయర్, పోలీస్ కమిషనర్
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 18: సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు సీఎం కేసీఆర్ అని, గోలొండ కోటపై జెండా ఎగరేసిన బహుజన వీరుడు అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీర్తించారు. బుధవారం కరీంనగరంలోని సర్వాయి పాపన్న 371 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ పాపన్నగౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతిఒకరూ ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 300 ఏండ్ల కంటే ముందే బహుజన రాజ్యం కోసం గోలొండ కోటను అధిరోహించి గోలొండ సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు పాపన్న అని గుర్తు చేశారు. ఒక గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నారన్నారు. ఇక్కడ కరీంనగర్ సీపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, ఏసీపీ మహేశ్‌గౌడ్, సీఐలు తాట లక్ష్మీబాబుగౌడ్, నరేష్‌గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం నాయకులు గణగాని సత్యనారాయణ గౌడ్ (కలర్ సతన్న), సింగం సతయ్య గౌడ్, కట్ట సత్తయ్యగౌడ్, గౌడ శంఖారావం పత్రిక ఎడిటర్ శ్రీనివాస్‌గౌడ్, తరుణ్ గౌడ్, కార్పొరేటర్లు కోటగిరి భూమాగౌడ్, గుగ్గిల్ల శ్రీనివాస్ గౌడ్, గుగ్గిల్ల జయశ్రీ ఉన్నారు.
పలువురి నివాళి
సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా అల్గునూర్ చౌరస్తాలోని విగ్రహానికి మేయర్ వై సునీల్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుల నుంచి ఎదిగి రాజ్యాధికారం చేపట్టిన మహానీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను బడుగులందరూ ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాలని సూచించారు.