కరీంనగర్ రూరల్, డిసెంబర్ 17: విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించి, మెరుగైన సేవలందించడమే లక్ష్యమని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ పీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ సబ్ స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారుల నుంచి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, కరీంనగర్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలపై 4 మాత్రమే ఫిర్యాదులు రావడం సిబ్బంది మెరుగైన పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, నూతన సర్వీసులు మంజూరు చేయడం, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, తదితర సమస్యలపై విద్యుత్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మొగ్దుంపూర్, చెర్లభూత్కూర్ సర్పంచులు జక్కం నర్సయ్య, దబ్బెట రమణారెడ్డి, నగునూర్ ఎంపీటీసీ సాయిల వినయ్‌సాగర్ ఆయా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సబ్‌స్టేషన్ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తిరుమలరావు, చరన్దాసు, నరేందర్, వడ్లకొండ గంగాధర్, రాజిరెడ్డి, రాజేందర్, రాజు, సంపత్‌కుమార్, అశోక్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది, నాయకులు దామెరపల్లి అంజిరెడ్డి, రాజిరెడ్డి, మల్లారెడ్డి, నర్సయ్య, మల్లయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.