కోజికోడ్, ఫిబ్రవరి 18 : కేరళలోని ఒక ఇన్ఫ్రా కంపెనీ అదిరేటి గిఫ్ట్‌లతో తన ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా రూ.20 కోట్ల రూపాయల విలువైన కార్లను తన ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ స్థాపించి 30 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కోజికోడ్ కేంద్రంగా ఉండే హైలైట్ గ్రూప్ సంస్థ రూ.20 కోట్ల విలువ చేసి 47 కార్లను తన ఉద్యోగులకు బహుమతిగా అందజేసింది. వారు అందజేసిన ప్రీమియమ్, ప్రముఖ మోడల్ కార్లలో రేంజ్ రోవర్లు, ఆడీ క్యూ8, ల్యాండ్ రోవర్, డిఫెండర్, టాటా హారియర్, కియా సెల్టాస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కైలాక్ రకాలు ఉన్నాయి.
వివిధ విభాగాల ఉద్యోగులు సంస్థకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ బహుమతులను అందజేసినట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 1996లో కోజికోడ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ రిటైల్, వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై తర్వాత నివాస, ఐటీ భవన నిర్మాణాలకు విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులున్న ఈ సంస్థ ప్రస్తుతం కోజీకోడ్‌లో 12.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. 5.6 వేల కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టింది.