సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు వెయ్యి రూపాయల లాభం చూపించి.. రూ. 2.25 కోట్లు ఓ ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుంచి కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే..సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్‌ను డిసెంబర్ 21న ‘హెచ్911 ఎంఓ మార్కెట్ థింక్ ట్యాంక్’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌కు యాడ్ చేశారు. అందులో ఉన్న గ్రూప్ సభ్యులు తాము ప్రతి రోజు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ స్క్రీన్ షాట్స్ పోస్టు చేస్తూ వెళ్లారు.
కొన్ని రోజుల పాటు వాటిని గమనించిన బాధితుడికి ఆ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న రాందేవ్ అగర్వాల్, మాణిక్‌లాల్, సివా వర్మ అనే పేర్లతో మాట్లాడి తాము టిప్స్ చెబుతామని.. మీరు పెట్టుబడి పెట్టి .. స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలు సంపాదించడంటూ సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక లింక్‌ను పంపించి, అప్లికేషన్ డౌన్లోడ్ చేయించి అకౌంట్ క్రియేట్ చేయించారు. మొదట రూ. 27వేలు, రూ. 49 వేలు రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టడంతో మీకు షేర్స్ అలాట్ అయ్యాయంటూ సూచనలు చేశారు. స్క్రీన్‌పై ఆ షేర్స్‌పై రూ. 2856 లాభం వచ్చినట్లు చూపించారు. అందులో నుంచి బాధితుడు రూ. 1000 విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో వాళ్లపై నమ్మకం కుదిరింది.
వారి మాటలు నమ్ముతూ దఫ దఫాలుగా రూ. 66.76 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో స్క్రీన్‌పై రూ. 7.87 కోట్ల లాభం కన్పించింది. మీకు గతంలో లోన్ కూడా ఇప్పించామని.. మీరు రూ. 96 లక్షలు చెల్లించాలంటూ షరత్ విధించారు. దీంతో స్క్రీన్‌పై రూ. 7 కోట్లు కన్పిస్తుండడం తో సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు రూ. 96 లక్షలు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత వాటిని విత్ డ్రా చేసుకోవడానికి మరింత డబ్బు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేసి వసూలు చేశారు. ఇలా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 9 వరకు బాధితుడి వద్ద నుంచి రూ. 2,25,25,836 వసూలు చేశారు. స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి మరింత డబ్బు అడుగుతుండడంతో తెలిసిన వారి వద్ద ఆరా తీయగా.. ఇదంతా మోసమని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.