19నకమాన్పూర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ
పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి గంగుల కమలాకర్
నిరుపేదకు నీడను అందించాలనే సీఎం సంకల్పం సాకారం
లబ్ధిదారులతో కలిసి సామూహిక భోజనాలు చేయనున్న మంత్రి
కొత్తపల్లి, డిసెంబర్ 17 : పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో కరీంనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగంగా సాగింది. మండల పరిధిలోని కమాన్‌పూర్, చింతకుంట, ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈ నెల 19న బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. కొత్తపల్లి మండలంలోని 8 గ్రామాలకు గాను తొలివిడుతగా నాలుగు గ్రామాలను ఎంపిక చేసి 127 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. కమాన్‌పూర్, చింతకుంట, ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆయా గ్రామాల్లో 20 ఇళ్ల చొప్పున 60 ఇండ్లు, కమాన్‌పూర్ శివారులో 67 ఇండ్లు నిర్మించారు. కమాన్‌పూర్‌లో అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. కమాన్‌పూర్‌కు మొదటి విడుతలో 67 ఇండ్లు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయి. మొదటి విడుతలో డ్యాం ముంపు గ్రామమైన రాములపల్లికి చెందిన 36 మందికి, కమాన్‌పూర్‌లో అర్హులైన 20 మందికి మంత్రి, కలెక్టర్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. మిగతా ఇండ్లను ప్రాధాన్యతా క్రమంలో కేటాయించనున్నారు. కమాన్‌పూర్ హామ్లెట్ రాములపల్లె భూనిర్వాసితులకు 47 ఇండ్లు, కమాన్‌పూర్ గ్రామస్తులకు 20 ఇండ్లు నిర్మించారు. రాములపల్లెలో 36 మంది అర్హులను ఎంపిక చేయగా కమాన్‌పూర్ గ్రామానికి చెందిన మరో 20 మందిని గ్రామసభ ద్వారా ఎంపిక చేశారు. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, దివ్యాంగులకు 5 శాతం, వితంతులకు 2 శాతం మేర లబ్ధిదారులను ఎంపిక చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా అర్హులైన నిరుపేదలకు అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.