తెలంగాణ చౌక్, డిసెంబర్17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని లాభసాటి సంస్థలను బడా వ్యాపారుల చేతిలో పెట్టడానికి కుట్రలు పన్నుతున్నదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్ ఆరోపించారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలను అడ్డుకోడానికి బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో కొనసాగుతున్న రెండో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ల ప్రైవేటీకరణతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకింగ్ రంగానికి దూరమవుతారని తెలిపారు. రుణాలు సైతం లభించవని చెప్పారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలనే దురుద్దేశంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను ప్రధాని మోదీ గుర్తించి రైతు చట్టాలను రద్దు చేసినట్లుగానే బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దామోదర్, నిఖిల్, వెంకటేశ్వర్లు, కుమార్, పోచయ్య పాల్గొన్నారు.