మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అందుబాటులో సాగు పరికరాలు
తక్కువ అద్దెకే రైతులకు
పెగడపల్లి జ్యోతి మండల సమాఖ్య ఆదర్శం
పెగడపల్లి, డిసెంబర్ 17;మండలంలోని రాములపల్లిలో పెగడపల్లి మండల జ్యోతి సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు, యంత్రాల అద్దె కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సన్న, చిన్నకారు రైతులకు తక్కువ ధరలో వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇస్తున్నారు. ఇలా రైతులు వ్యవసాయంలో సాగు పనులకు వాడుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనుండగా, వీటి ద్వారా వచ్చే అద్దె వల్ల ఖర్చులు పోనూ, మండల సమాఖ్యకు కొంత మేర ఆదాయం సమకూరుతున్నది. జిల్లా సమాఖ్య నుంచి రుణం పొంది రూ.8.20 లక్షలతో వరినాటు యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ యంత్రం రైతులకు ఎలాంటి కూలీల ఖర్చు లేకుండా, తక్కువ సమయంలో వరి నాటు వేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం రూ.4వేల ఖర్చుతో 1ఎకరం పొలంలో వరి నాటు వేసేందుకు ఇది ఉపయోగపడుతుందని మండల సమాఖ్య సభ్యులు తెలిపారు. మరో రూ.లక్ష ఖర్చుతో 2 తైవాన్ స్ప్రేయర్లు, 2 డ్రమ్ సీడర్లు, 1 గడ్డి కటింగ్ యంత్రం, పంట చేన్లల్లో కోతులు, పక్షులు, అడవి పందులను నివారించేందుకు గాను 4 కార్బేట్ గన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. మండల రైతులకు తక్కువ అద్దెకు ఇవ్వడం జరుగుతుందని, వివరాలకు సెల్ నంబర్ 99085 90200ను సంప్రదించాలన్నారు.
వారందరూ సర్కారు పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా పురోగమిస్తున్నారు. అందరిలా కాకుండా వినూత్నంగా ముందుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతాంగానికి తక్కువ ధరకు సాగు యంత్రాలను రెంట్‌కు ఇస్తూ వినూత్న పంథాలో ముందుకెళ్తున్న పెగడపల్లి మండల జ్యోతి సమాఖ్య సభ్యులపై ప్రత్యేక కథనం..
రైతుల సౌకర్యం కోసమే ..
జ్యోతి మండల సమాఖ్యా ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్ధం అద్దె పరికరాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఈ సెంటర్‌ను ప్రారంభించాం. చాలామంది రైతులు వీటిని సాగు పనులకు ఉపయోగించుకుంటున్నారు. సమాఖ్యకు సైతం ఆదాయం చేకూరుతున్నది.
తక్కువ అద్దెకు రైతులకు ఇస్తాం
జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మండల రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలు ఇస్తాం. సుమారు రూ.9.20 లక్షలు వెచ్చించి రైతులు వ్యవసాయ పనుల్లో ఎక్కువగా ఉపయోగించే యంత్రాలను కొనుగోలు చేశాం. ముఖ్యంగా వరి నాటు యంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.
-భాగ్య, జ్యోతి మండల సమాఖ్య అధ్యక్షురాలు