రాంనగర్, నవంబర్ 17: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు గురువారం ముగియనుంది. బుధవారం అత్యధికంగా 301 దరఖాస్తులు వచ్చాయి. గురువారం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిపారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో 85, రూరల్ పరిధిలో 164, జమ్మికుంట స్టేషన్ పరిధిలో 55, హుజూరాబాద్‌లో 99, తిమ్మాపూర్‌లో 106 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ కోర్టు కేసుతో ఆగిపోతుందనే వదంతులను నమ్మవద్దని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల ఎస్సీ, గౌడ కులస్తులు కుల ధ్రువీకరణ పత్రం లేకుంటే అండర్ టేకింగ్ ఫాం సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్ని లైసెన్సులైనా తీసుకోవచ్చని తెలిపారు. ఇతర జిల్లాల్లో తీసిన డీడీలు కూడా అంగీకరిస్తామని, ఈ నెల 20న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నట్లు పేర్కొన్నారు. టెండర్ కేంద్రాల వద్ద ఎక్సైజ్ అధికారులు చంద్రశేఖర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ తాతాజీ, సీఐలు ఇంద్రప్రసాద్, అక్బర్ హుస్సేన్, దుర్గాభవానీ, తిరుమలత, ఎస్ఐలు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.