
ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంస్థ ఎండీ సజ్జనార్
తెలంగాణ చౌక్, డిసెంబర్ 15: ప్రతి ఉద్యోగి టీఎస్ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వామి కావాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. బుధవారం కరీంనగర్ జోనల్ కార్యాలయంలో ‘ప్రగతికి మరోఅడుగు-నేను సైతం మార్పుకోసం, ‘ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులు’ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడారు. సంస్థకు వినియోగదారుడు దేవుడితో సమానమన్నారు. సేవా దృక్ఫథంతో పనిచేసినప్పుడే వారి మన్ననలు పొందవచ్చని చెప్పారు. ఉద్యోగులు శిక్షణను సద్వినియోగం చేసుకొని సంస్థ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. డిపో-1 కండక్టర్ జగన్ మోహన్‌తో మాట్లాడుతూ, శిక్షణతో నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఆర్ఎం శ్రీధర్ ఉద్యోగులతో మాట్లాడుతూ, అందరూ సమన్వయంతో పనిచేయాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సమావేశంలో డిపో మేనేజర్లు అర్పిత, మల్లేశం, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.