ఒకరు మృతి.. మరో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
అర్ధరాత్రి వరకు కొనసాగిన గాలింపు చర్యలు
అయినా దొరకని పిల్లల ఆచూకీ
కొడుకుల జాడ కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
రాజీవ్‌నగర్‌లో విషాదఛాయలు
సిరిసిల్ల రూరల్, నవంబర్ 15 : సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని మానేరుతీరం శోకసంద్రమైంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాగు, ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈత కోసం వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ఒకరు నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం.. మరో ఐదుగురు గల్లంతవడం రాజీవ్‌నగర్‌లో విషాదం నింపింది. అర్ధరాత్రి వరకూ గాలింపు చర్యలు కొనసాగినా పిల్లల ఆచూకీ లేకపోవడంతో ఆ తల్లిదండ్రులకు కొండంత దుఃఖం మిగిలింది.
సిరిసిల్ల మున్సిపల్ 11వ వార్డు పరిధిలోని రాజీవ్‌నగర్ కార్మికక్షేత్రానికి చెందిన కొలిపాక గణేశ్ (13), జడల వెంకటసాయి (13), తీగల అజయ్ (13), కొంగ రాకేశ్ (12), సిరిమల్ల క్రాంతి (14), సింగం మనోజ్ (16), కోల అరవింద్ (14), దిడ్డి అఖిల్, వాసాల కల్యాణ్ సిరిసిల్ల ప్రభు త్వ బాలుర పాఠశాల విద్యార్థులు. వీరిలో రాకేశ్ 6వ తరగతి, గణేశ్, కల్యాణ్, క్రాంతి కుమార్ 8వ తరగతి చదువుతుండగా, మిగతావారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సోమవారం సాయంత్రం సమయంలో ఈ తొమ్మి ది మంది కలిసి సరదాగా ఈతకొట్టేందుకని నెహ్రునగర్ ప్రాంతంలోని మానేరువాగుకు సైకిళ్లపై వెళ్లారు. అక్కడ చెక్ డ్యాం పరిసరాల్లో సైకిళ్లను ఉంచారు. దుస్తులను, చె ప్పులను విడిచి ఈత కోసం నీటిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో గణేశ్ మునిగిపోగా, వెంకటసా యి, రాకేశ్, క్రాంతి, అజయ్, మనోజ్ గల్లంతయ్యారు. కండ్ల ముందే స్నేహితులు మునిగిపోతుండడం చూసి మ రో ముగ్గురు విద్యార్థులు అఖిల్, అరవింద్, కల్యాణ్ భయపడి కేకలు వేశారు. మానేరు అవతలి ఒడ్డు వైపు (తంగళ్లపల్లి) ఉన్న స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. మరో కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సిరిసిల్ల రూర ల్ సీఐ ఉపేందర్, ఎస్ఐ లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు.
ఒకరి మృతి.. ఐదుగురు గల్లంతు..
విషయం తెలిసిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ సదానందం, సీఐ ఉపేందర్, ఎస్ ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులు, రెస్క్యూటీం సభ్యులు వర్షంలోనూ గాలించారు. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మిగ తా ఐదుగురు విద్యార్థుల కోసం వెదికారు. రాత్రి 8గంటల తర్వాత కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా రెస్క్యూటీంను కూడా రప్పించారు. బ్యాటరీ లైట్ల వెలుతురులో అర్ధరాత్రి వరకు గాలించారు. అయినా ఎవరి ఆచూకీ లభించలేదు.
కన్నీరుమున్నీరు..
విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకున్న ఆ ఆరుగురు విద్యార్థుల కుటుంబసభ్యులు పరుగుపరుగున మానేరు తీరం వద్దకు చేరుకున్నారు. గణేశ్ మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురాగా, తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరుమన్నారు. మిగతా పిల్లల తల్లిదండ్రులు కొడుకుల జాడ కోసం ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గాలిస్తున్న కొద్దీ ఎక్కడ చేదు వార్త వినాల్సి వస్తోందోనని తల్లడిల్లుతున్నారు. గణేశ్ మతృదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు పోలీసులు తరలించారు.