హౌసింగ్‌బోర్డుకాలనీ, నవంబర్ 15: ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూరప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యల పరిషారానికి డయల్ యువర్ కలెక్టర్‌ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రజాసమస్యలు పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిషరించాలని ఆదేశించారు. వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు కౌంటర్ దాఖలు చేయాలని, దాఖలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామడుగు మండలం నుంచి రమేశ్ ఫోన్ చేసి మాట్లాడుతూ.. వెదిర గ్రామం నుంచి కిలోమీటర్ పొడవునా రోడ్డు పాడైందని తెలుపగా, సర్వే చేయించి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం నుంచి రాజయ్య మాట్లాడుతూ.. తన భూమి ధరణిలో రిజిస్ట్రేషన్ కావడం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నానని, ఇప్పటివరకు ధరణిలో నమోదు కాలేదని తెలుపగా.. తహసీల్దార్ పరిశీలిస్తారని తెలిపారు. తిమ్మాపూర్ మండలం నుంచి బిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన కూతురు డిగ్రీ చదువుతున్నదని వసతి గృహంలో సీటు ఇప్పించాలని కోరగా.. సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సీటు ఇప్పిస్తామని చెప్పారు.
తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ఐకేపీ సెంటర్లో ధాన్యం బస్తాలకు హమాలీలు డబ్బులు తీసుకుంటున్నారని వెంకటనర్సయ్య ఫిర్యాదు చేయగా.. పరిశీలించి చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు సూచించారు. రామడుగు మండలం నుంచి లింగయ్య మాట్లాడుతూ.. గ్రామం మధ్యలో డెయిరీఫాం ఏర్పాటు చేస్తున్నారని, దీంతో ప్రజలందరికీ ఇబ్బందులెదురవుతాయని తెలుపగా.. గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిషరించాలని డీపీవోను ఆదేశించారు. కరీంనగర్ భగత్‌నగర్ నుంచి హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా భగత్‌నగర్‌లో డ్రైనేజీ పనులను అసంపూర్తిగా నిలిపివేశారని తెలుపగా.. వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, డీఎంహెచ్‌వో జువేరియా, మెప్మా పీడీ బి.రవీందర్, ఉద్యానవనశాఖ డీడీ శ్రీనివాస్, డీపీవో వీరబుచ్చయ్య, ల్యాండ్ సర్వే అధికారి అశోక్, మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు, మారెటింగ్ శాఖ డీడీ పద్మావతి, ఎస్సీ అభివృద్ధి సంస్థ ఉప సంచాలకుడు నేతానియల్, డీసీవో శ్రీమాల, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.