e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home కరీంనగర్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలి
అధికారులకు మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశం
కలెక్టర్‌, సీపీ, మేయర్‌తో కలిసి సమీక్షా సమావేశం

కార్పొరేషన్‌, సెప్టెంబర్‌ 15: జిల్లాలో ఈ నెల 19న జరుగనున్న వినాయక నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ వీ సత్యనారాయణ, నగర మేయర్‌ వై సునీల్‌ రావు, జిల్లా అధికారులతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్‌లో ఏ పండుగ అయినా అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి సోదర భావంతో జరుపుకొంటారన్నారు. నగరం శాంతి, సామరస్యానికి మారు పేరన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా నిమజ్జనం శాంతియుత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మానకొండూర్‌ చెరువు, కొత్తపెల్లి చెరువు, చింతకుంట వద్ద కెనాల్లో నిమజ్జనం చేసేందుకు వీలుగా బారికేడ్‌లు, లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. ఒకో పాయింట్‌ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్‌ ఉండాలన్నారు. వాటిని గ్రానైట్‌ యజమానులు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అలాగే ఆయా చోట్ల మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు.

నిమజ్జన స్థలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లను (స్విమ్మర్లను) మూడు షిప్టుల్లో నియమించాలని చెప్పారు. గణేశ్‌ నిమజ్జనం రాత్రి ఒకటిలోగా పూర్తయ్యేలా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సాగే రూట్లలో ప్రమాదాలు జరుగకుండా విద్యుత్‌ లైన్లను పైకి లేపాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ, నగరంలో నిమజ్జనానికి గుర్తించిన మూడు ప్రాంతాల వద్ద చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. వినాయక నిమజ్జనం రోజున జిల్లాలో వైన్‌ షాపులు, బార్లు, బెల్ట్‌ షాపులను మూసి వేయించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. సీపీ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 2,697 గణేశ్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారని, కరీంనగర్‌లో 500 పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా పకడ్బందీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. శోభాయాత్ర జరిగే రోడ్లల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మొబైల్‌ సీసీ కెమెరాలను కూడా వినియోగిస్తామని తెలిపారు. నగర మేయర్‌ వై సునీల్‌ రావు మాట్లాడుతూ, గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా అన్ని రూట్లలో లైటింగ్‌, తాగునీరు, శానిటేషన్‌ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లపై గుంతలను పూడ్చుటకు టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. నిమజ్జనం తర్వాత చెరువుల్లో చెత్తను తొలగించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరీమా అగర్వాల్‌, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా.జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవ రావు, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

మండపాల విద్యుత్‌ బిల్లు చెల్లిస్తా
ప్రతి సంవత్సరం మాదిరిగానే కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపాలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులను సొంతంగా చెల్లిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. ఏ మండపాల నిర్వాహకుల నుంచి కూడా విద్యుత్‌ బిల్లులను వసూలు చేయవద్దని విద్యుత్‌ అధికారులకు సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana