హుజూరాబాద్, ఆగస్టు 14;ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే సభ ముస్తాబవుతున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా, ఆదివారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లూ కానున్నాయి. మూడ్రోజుల క్రితం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పరిశీలించారు. చారిత్రాత్మకమైన సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండగా, ఇందులో ఎకువ సంఖ్యలో దళితులే ఎక్కువ ఉండనున్నారు.
ఇప్పటికే రైతుబంధు వంటి గొప్ప పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సర్కారు మరో విప్లవాత్మకమైన దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి గతంలో రైతుబంధు మొదలైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామమే వేదిక కానున్నది. ఇప్పటికే సభకు 90 శాతం ఏర్పాట్లు పూర్తి కాగా, దీనికి లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నది. సభకు 825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాల్లో రానున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా సభ విజయవంతమయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి నీళ్లతో పాటు భోజన సౌకర్యం సభికులకు కల్పించనున్నారు.
జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ
జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీతో నాగార్జున సాగర్‌లో సభను ఏర్పాటు చేశారు. ఎంత భారీ వర్షం పడినా, గాలులు వీచినా తట్టుకొనే సామర్థ్యం కలిగి ఉండడం, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం లేకపోవడం దీని ప్రత్యేకత. అందరూ అసీనులయ్యేందుకు కుర్చీలను సమకూర్చుతున్నారు.
రెండు పెద్ద డయాస్‌లు
ప్రధాన డయాస్‌తో పాటు కళాకారులకు ప్రత్యేకంగా మరో డయాస్ ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన డయాస్‌లో వెనుక కూర్చున్నా నాయకులు కనిపించేందుకు స్టేజీ నిర్మాణం జరుగుతున్నది. వందకు పైగా స్టేజీపై కూర్చున్న తట్టుకునే విధంగా డయాస్ నిర్మిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం డయాస్ ముందు చిన్నపాటి స్టేజీ నిర్మిస్తున్నారు. మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు స్త్రీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తుండగా, వీరికి ఇబ్బందులు కలగకుండా మహిళా పోలీసులు ఉండనున్నారు.
3500 మంది పోలీసులు
సభ సజావుగా సాగేందుకు 3500 మంది పోలీసులు రానున్నారు. ఇందులో ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారులుండగా, ఏఎస్పీలు ఆరుగురు, ఏసీపీ స్థాయి అధికారులు 30 మంది, ఇన్స్పెక్టర్లు 63 మంది, 200 మంది ఎస్సైలు, మిగతా వాళ్లలో ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉండనున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సభలోకి అనుమతించనున్నారు.
సీఎం సభకు దారి మళ్లింపు
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, మీడియా ప్రతినిధుల వాహనాల పారింగ్ కోసం 15స్థలాలను కేటాయించినట్లు పేరొన్నారు.
హుజూరాబాద్ నుంచి వచ్చే వాహనాల కోసం చెల్పూర్ గ్రామం నుంచి శాలపల్లి-ఇందిరానగర్ వరకు 10 పారింగ్స్థలాలు.
జమ్మికుంట నుంచి వచ్చే వాహనాలకు 4 స్థలాలు.
సాయి డెవలపర్స్, లిడ్ క్యాప్‌లో రెండు బస్సు పారింగ్ స్థలాలు.
పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను క్రమపద్ధతిలో పారింగ్ చేయాలి.
హుజూరాబాద్ – జమ్మికుంట మార్గంలో కేవలం సభకు వెళ్లే వాహనాలకే అనుమతి ఉంటుంది. ఇతర వాహనదారులు సిర్సపల్లి క్రాస్ రోడ్డు నుంచి సిర్సపల్లి, పోతిరెడ్డిపేట మీదుగా జమ్మికుంటకు వెళ్లాలి. జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌కు వచ్చే ఇతర వాహనదారులు ఇదే మార్గం గుండా వెళ్లాలి.
జమ్మికుంట నుంచి కరీంనగర్ వెళ్లే వాహనదారులు వీణవంక, చల్లూరు, మానకొండూరు మీదుగా, వరంగల్, సిద్ధిపేట మార్గంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులు కరీంనగర్‌కు వెళ్లేందుకు ఎలతుర్తి, ములనూరు, హుస్నాబాద్, చిగురుమామిడి మీదుగా కరీంనగర్‌కు వెళ్లాలి. తిరుగు ప్రయాణం ఇదే మార్గాలను అనుసరించాలి.
ఈ రహదారిపై ఎవరూ వాహనాలను నిలపకూడదు.
పూర్తి వివరాల కోసం కరీంనగర్ అడిషనల్ డీసీపీ(పరిపాలన) జీ చంద్రమోహన్, స్పెషల్ ఆఫీసర్ పీ అశోక్‌ను సంప్రదించాలి.