
సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మూడేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానం
రామడుగు, డిసెంబర్ 13: ముదిరాజ్‌ల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా మూడేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుంకెను మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తులు సోమవారం గంగాధర మండలం బూర్గుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజ్‌లు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తెచ్చారన్నారు. ముదిరాజ్‌లు, గంగపుత్రుల అభివృద్ధికి సబ్సిడీపై వాహనాలు, వలలు అందించినట్లు చెప్పారు. ఉచితంగా చేపపిల్లలను అందించి ప్రతి చెరువులో విడుదల చేసినట్లు చెప్పారు. కులవృత్తులకు ఊతమిస్తూ సహకారం అందించడం జరిగిందన్నారు. ఏడేండ్ల క్రితం స్థానిక ముదిరాజ్‌లు ఉపాధి లేక బతుకుదెరువు కోసం అప్పుచేసి ముంబై, భీవండి, దుబాయ్, మస్కట్‌కు వెళ్లి కుటుంబాలను పోషించుకున్నారని పేర్కొన్నారు. నేడు చెరువులన్నీ చేపలతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. వరదకాలువలో సంవత్సరం పొడవునా చేపలు పట్టుకొని జీవించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానన్నారు. ముదిరాజ్ కులానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి తిరుపతిని గోపాల్రావుపేట మార్కెట్ చైర్మన్‌గా నియమించాలని ముదిరాజ్ నాయకులు, మహిళలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జిట్టవేణి రాజు, నాయకులు రాజమల్లు, అంజయ్య, కమలాకర్, మామిడి నర్స య్య, రాగం లచ్చయ్య, ఉప్పరి నర్సయ్య, రా గం రాజు, బసరవేణి లక్ష్మణ్ తదితరులున్నారు.