
ప్రగతిలో కంట్రోల్ రూం పనులు
పూర్తయిన మూడు పీటీఆర్ ఫ్లింత్లు
ముకరంపుర, డిసెంబర్ 13: దేశంలో స్మార్ట్ సిటీల జాబితాలో ప్రత్యేకతను చాటుతున్న కరీంనగర్ విద్యుత్ సరఫరా విషయంలోనూ ముందు నిలిచేలా సంబంధిత అధికారులు చేస్తున్న కృషి ఫలిస్తున్నది. రెప్పపాటు సైతం అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు పద్మనగర్ బైపాస్‌లో కొత్తగా 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు నిరంతరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా గుత్తేదారు పనుల్లో వేగం పెంచారు. కొత్త సబ్‌స్టేషన్ కరీంనగర్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రస్తుతం నగరంలోని రెండు 132కేవీ సబ్స్టేషన్లపై ఉన్న ఓవర్‌లోడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. స్ట్రక్చర్ నిర్మాణాలు తుది దశకు చేరాయి. లైన్ ఇన్ లైన్ అవుట్ విధానంలో మల్కాపూర్ శివారులోని దుర్శేడు-సిరిసిల్ల లైన్‌కు పద్మనగర్ 132కేవీని అనుసంధానించనున్నారు. ఇప్పటికే మల్కాపూర్ నుంచి పద్మనగర్ వరకు టవర్లు, లైన్ల పనులు చివరి దశకు చేరాయి.
ప్రగతిలో కంట్రోల్ రూం
సబ్ స్టేషన్ నిర్మాణంలో అత్యంత కీలకమైంది కంట్రోల్ రూం. ప్రధాన లైన్ నుంచి 132కేవీ సబ్‌స్టేషన్‌కు సరఫరాను తీసుకోవడంతో పాటు ఫీడర్ల వారీగా సరఫరా నియంత్రణ వ్యవస్థ అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. సబ్‌స్టేషన్‌లోని ప్రతి విభాగాన్ని కంట్రోల్ రూం నుంచే నియంత్రించే ఏర్పాట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో కంట్రోల్ రూం నిర్మాణంలో అధికారులు అడుగడుగునా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాణ్యత విషయంలో రాజీలేకుండా ప్రతి దశలోనూ పక్కాగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానేరు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే బ్యాక్ వాటర్‌తో ఏ సమస్య రాకుండా ఏర్పాట్లు చేశారు. బైపాస్ దారి కంటే ఎత్తులో ఉండేలా సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా భవనం పటిష్టంగా ఉండేందుకు భూమి నుంచి సుమారు 2 మీటర్ల లోతు నుంచి పిల్లర్లు నిర్మిస్తున్నారు. నీటి ఊట అధికంగా వస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోస్తూ పనికి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం ఫ్లింత్ దశలో ఉన్నది. మూడు నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా పనుల్లో వేగం పెంచారు.
పూర్తయిన మూడు పీటీఆర్ ఫ్లింత్లు
సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్లు కీలకమైనవి. భారీ పరిమాణంలో ఉండే వీటిని బిగించేందుకు మూడు ఫ్లింత్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో రెండింటిపై ట్రాన్స్ఫార్మర్లను బిగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మరో ఫ్లింత్ను భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉంచారు.