
సిరిసిల్లలో శరవేగంగా నిర్మాణ పనులు
రూ.3కోట్లు కేటాయించిన మంత్రి కేటీఆర్
హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 13: క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నది. విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడలకు అవసరమైన సహకారం అందిస్తున్నది. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆధునీకరణకు రూ.3కోట్లు కేటాయించారు. దీంతో పనులు శరవేగంగా సాగుతుండగా క్రీడాకారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సిరిసిల్ల పట్టణంలో క్రీడాకారులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఒకటి మాత్రమే వేదికగా ఉన్నది. రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ టోర్నమెంట్లు ఇక్కడ గతంలో అనేకసార్లు నిర్వహించారు. రాజకీయ పార్టీల బహిరంగ సభలు, సర్కస్, ఎగ్జిబిషన్ షోలకు మైదానాన్ని కేటాయిస్తుండడతో పలు సందర్భాల్లో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడంలేదు. కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు మైదానాన్ని శుభ్రం చేయకపోవడంతో కొత్త సమస్యలు ఎదురయ్యేవి. అనేక సందర్భాల్లో క్రీడాకారులే సొంత డబ్బులతో మైదానాన్ని శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సమస్యలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సువిశాల ప్రాంతంలో ఉన్న మినీస్టేడియం ఆధునీకరణపై దృష్టి సారించి నిధులు కేటాయించారు.
క్రీడాహబ్‌గా మినీస్టేడియం
జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్‌నగర్‌లో కాంగ్రెస్ హయాంలో అరకొర వసతులతో నిర్మించిన మినీస్టేడియం క్రీడాకారులకు ఉపయోగకరంగా లేకపోయింది. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించి దీని ఆధునీకరణకు నిధులు కేటాయించారు. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీని అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయించగా పనులు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. వాలీబాల్, త్రోబాల్, క్రికెట్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, వాకింగ్, రన్నింగ్ ట్రాక్స్, కాంపౌండ్‌వాల్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. తుదిదశలో ఉన్న పనులను త్వరగాపూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
శరవేగంగా ఆధునీకరణ పనులు
మినీ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది జిల్లాలోని క్రీడాకారులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవలే వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు వచ్చాయి. సదరు పనులు కూడా జరుగుతున్నాయి. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.