విద్యానగర్, నవంబర్ 13: కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్లతో శనివారం కొవిడ్ వ్యాక్సినేషన్, ప్రభుత్వ దవాఖానల నిర్వహణ, వైద్య సేవలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసి, ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో ఇంటింటా సర్వే చేయించి జిల్లాల వారీగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కలెక్టర్లు ప్రకటించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కలెక్టర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. దవాఖానల్లో ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్లు, దవాఖాన సూపరింటెండెంట్లు ప్రజలకు వివరించి చికిత్స కోసం వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చేసిన శస్త్ర చికిత్సలు, వైద్య సేవల వివరాలు ప్రతి నెలా డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది వారీగా రివ్యూ చేయాలని కలెక్టర్లకు సూచించారు. పీహెచ్‌సీల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రభుత్వ దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. మెడికల్ కళాశాలల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, డీపీవో వీర బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.