న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం
జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని
కార్పొరేషన్, నవంబర్ 13: ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని కోరారు. నగరంలోని ‘రెవెన్యూ’ గార్డెన్స్‌లో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళాల సంఘాల సభ్యులు, మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మాట్లాడుతూ, మహిళలు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగం కల్పించిన హకులు, చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై దేశవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదికి ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం మండల జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి భవనాల కోర్టు ప్రాంగణాల్లో ఉంటాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఏదైనా కేసులో మహిళలను అరెస్టు చేయాల్సి వస్తే మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే తీసుకెళ్లాలని, సాయంత్రం ఆరు తర్వాత అరెస్టు చేయడానికి వీలు లేదని, 24 గంటల్లోగా కోర్టులో హాజరుపర్చాలని తెలిపారు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్‌లో పరిషరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ పౌర హకు, సమానత్వం, జీవించే హకు ఉన్నట్లు తెలిపారు. హకులకు భంగం కలిగినప్పుడు పేదలు జిల్లా, మండల న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి న్యాయ సహాయం పొందాలని సూచించారు.
పిల్లల రక్షణ కోసం ప్రత్యేకంగా పోక్సో చట్టం అమల్లోకి వచ్చిందని, పిల్లలపై జరిగే నేరాలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా సహాయం పొందాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సుజయ్‌కుమార్ మాట్లాడుతూ, పేదలకు న్యాయ సేవలందించేందుకే 1987లో న్యాయసేవాధికార సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యను తెల్లకాగితంపై రాసి ఇస్తే ఎవరి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వారిని పిలిపించి పరిషరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి భవానీచంద్ర, అదనపు డీసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రవీందర్, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్‌రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, వీధి వ్యాపారులు, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.