44వ వసంతంలోకి ప్లాంట్
2600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం
43 ఏండ్ల ప్రస్థానంలో అనేక అవార్డులు, రివార్డులు
100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ప్లాంట్‌తో సరికొత్త అధ్యాయం
జ్యోతినగర్, నవంబర్ 13;తెలంగాణ రాష్ర్టానికి వెలుగుల దివ్వెగా భాసిల్లుతున్న రామగుండం ఎన్టీపీసీ 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మెరార్జీదేశాయ్ చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్ట్ 2600 మెగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది. 43 ఏండ్ల ప్రస్థానంలో అనేక రికార్డులు తిరగరాసి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది. దక్షిణాది రాష్ర్టాలకు వెలుగులు పంచుతూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. మహారత్న హోదాలో ఐఎస్వో 14001 సర్టిఫికెట్ సాధించిన ఏకైక ప్రాజెక్టుగా నిలిచింది. ఇటీవలే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సొబగులద్దుకొని జిగేల్ మంటున్నది.
దక్షిణాది రాష్ర్టాలకు కరెంట్ అందించే లక్ష్యంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1978లో 2600 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలోని రామగుండంలో ఈ ప్లాంట్‌ను స్థాపించింది. సింగరేణి బొగ్గు ఆధారితంగా విద్యుత్ ఉత్పత్తితో దినదినం పురోగమిస్తూ మహారత్న హోదాను దక్కించుకున్నది. ఇటీవలే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌తో పాటు 1600 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ థర్మల్ పవర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. యేటా లక్ష్యం మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ అటు పర్యావరణ పరంగా, ఇటు కరెంట్ తయారీలో అనేక అవార్డులు పొందింది. 2019-2020 నాటికి నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్స్లెంట్ ఎనర్టీ ఎఫిషియెంట్ , నేషనల్ సేప్టీ కౌన్సిల్ నుంచి రక్షణలో ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డు, గోల్డెన్ ఫికాక్ అవార్డులు అందుకున్నది. అడిట్ పురోగతిలో ఐఎస్వో 50001 గుర్తింపు సర్టిఫికెట్ లభించింది. 2005లో సోషల్ రెస్పాన్సిబులిటీకి రూ. 25లక్షలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యేటేటా నిధులు పెంచుతూ సమీప గ్రామాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సేవలను విస్తరించింది.