హుజూరాబాద్ ప్రజలకు, నీ ఆత్మగౌరవానికి సంబంధం ఏంది..!
సానుభూతి కోసమే ఈటల పాకులాట
ఉచిత కరెంటు ఇచ్చే టీఆర్ఎస్ కావాలా.. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?
మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్‌లో రెడ్డి సంక్షేమ సంఘం భవనానికి స్థలం మంజూరు పత్రం, రూ.కోటి నిధుల జీవో కాపీ అందజేత
హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 13 : ఈటల రాజేందర్.. నీకు ఓటెందుకు వేయాలి.. హుజూరాబాద్ ప్రజలకు, ఆత్మగౌరవానికి సంబంధం ఏమిటో బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో రెడ్డి సంక్షేమ సంఘం భవనానికి సంబంధించి స్థల మంజూరు పత్రం, రూ.కోటి నిధుల కేటాయింపు జీవో కాపీని ఆ సంఘం నాయకులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మగౌరవం వట్టి బూటకమని, కేవలం సానుభూతి కోసమే ఈటల రాజేందర్ పాకులాడుతున్నాడని అన్నారు. తనకు ఎందుకోసం ఓటు వేయాలో నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందర్ చెబితే బాగుంటుందని హితవు పలికారు. రెడ్డి కులస్తులు అందరితో కలుపుగోలుగా ఉంటారని, మీ ఆశీర్వాదం టీఆర్ఎస్కు కావాలని కోరారు. రెడ్డిల్లో ఎక్కువగా ప్రధాన వృత్తి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, రైతు బంధు, రైతు బీమాతో రెడ్డిలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతాంగానికి సాగునీరు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నభూతో నభవిష్యత్ అని కొనియాడారు.
గెల్లు శ్రీను గెలుపు కోసం సహకరించాలి
ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు కోసం రెడ్డి కులస్తులందరూ సహకరించాలని కోరారు. ఉద్యమ సమయంలో అనేక కేసులు ఆయనపై నమోదయ్యాయని, కులాలకతీతంగా శ్రీనివాస్ అఖండ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. రెడ్డి కులస్తులు రెడ్డి కులం కాదని, ఒక వ్యవస్థని, ఒక ఓటు కూడా జారిపోకుండా టీఆర్ఎస్కే వేయాలని పేర్కొన్నారు. ఏడేండ్లలో మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి ఓ ఎమ్మెల్యేగా ఎలా సాధ్యమవుతుందో ఆలోచన చేయాలన్నారు. బీజేపీ తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈటల.. ఇప్పుడు వాటిని సమర్థించినట్లే కదా అని ప్రశ్నించారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
మార్కండేయ వంశస్తులు మాట తప్పరు..
మార్కండేయ వంశస్తులు మాట తప్పరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణ సమీపంలోని అహల్యనగర్‌లో పద్మశాలీ సంఘం భవన నిర్మాణ భూమిపూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలందరూ ఏకతాటిపై ఉండి టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఎంపీపీలు ఇరుమల్ల రాణి, సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, పోరెడ్డి శంతన్‌రెడ్డి, బిల్ల వెంకట్‌రెడ్డి, పద్మశాలీ సంఘం నాయకులు స్వర్గం రవి, శివాజీ, కొండ గణేశ్, సదానందం తదితరులున్నారు.
మా మద్దతు టీఆర్ఎస్కే..
పద్మశాలీల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మా గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. ప్రజలందరికీ న్యాయం చేస్తున్నది. మా పద్మశాలీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం మేమంతా కష్టపడుతాం.
రైతుల కోసం కేసీఆర్ చాలా చేసిండు..
రైతుల కోసం కేసీఆర్ చాలా చేసిండు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిండు. ఆయన ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు చేయవట్టే కంటి నిండా నిద్రపోతున్నాం. రైతు బంధుతో కొంత పెట్టుబడి రందీ తీరింది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా టీఆర్ఎస్కే ఓటు వేస్తాం. రెడ్డి సంఘం భవనానికి నిధులు, స్థలం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
గెల్లు శ్రీను కోసం కష్టపడుతాం..
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపుకోసం కోసం కష్టపడుతాం. రెడ్డి కులస్తులం ఏకతాటిపైన ఉండి టీఆర్ఎస్ను గెలిపించుకుంటాం. కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. రెడ్డి సంఘం భవనానికి స్థలం ఇచ్చినందుకు, భవన నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. వారికి రుణపడి ఉంటాం.