వరికి బదులుగా ఆరుతడి
రంగంలోకి దిగిన వ్యవసాయ అధికారులు
రైతు క్షేత్రాల్లో విస్తృత పర్యటనలు
అన్నదాతల్లో పెరుగుతున్న అవగాహన
కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ):యాసంగి బియ్యం కొనుగోళ్లకు కేంద్రం మోకాలడ్డడంతో జిల్లా రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాలో వరికి బదులు ఏ పంటలు వేసినా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు రంగంలోకిదిగి రైతు క్షేత్రాల్లో పర్యటిస్తున్నారు. ఇతర పంటలు సాగు చేసుకోవాలని సలహాలు, సూచనలు చేస్తున్నారు. వానకాలం, యాసంగి తేడా లేకుండా వరి సాగు చేసే రైతులు ఒక్కసారిగా ఇతర పంటలవైపు మరలుతున్నారు. యాసంగిలో పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల సాగు మేలనే నిర్ణయానికి వస్తున్నారు. ఒక రైతు క్షేత్రంలో ప్రతి పంట సాగు విస్తరించేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర పంటలు ఏ రకాలు, ఎలా సాగు చేయాలో వివరిస్తున్నారు.
రెండు మూడేళ్లలో నీటి వసతి పెగడంతో రైతులు వరి లేదంటే పత్తి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఫలితంగా ఇతర పంటలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం అంటేనే ఈ రెండు పంటలనే స్థితికి చాలా మంది రైతులు వెళ్లారు. దీంతో వరిలో అధిక దిగుబడులు రావడం, కేంద్రం యాసంగిలో వడ్లను కొనబోమని మెలిక పెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత కొట్లాడినా కనికరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ‘రైతులు నష్టపోవద్దు’ అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసుకునే విధంగా వారిని సమాయత్తం చేస్తోంది. గతంలో ఒక రైతు క్షేత్రంలో ఎన్ని పంటలు సాగయ్యేవో అన్నింటినీ ఇప్పుడు గుర్తుచేస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా ఇతర పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యాసంగిలో ఇతర పంటలు సాగుచేసుకుంటే వచ్చే లాభాలను వివరిస్తోంది. వరికంటే అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని సూచిస్తోంది. యాసంగికి అనువైన మక్క, పల్లి, శనగ, పెసర, బబ్బెర, మినుము, కూరగాయలు, తదితర ఇతర పంటలను సాగు చేసుకోవాలని చెబుతోంది.
కరీంనగర్ కలెక్టర్ విస్తృత పర్యటన
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వ్యవసాయ, ఉద్యాన అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాలుగు రోజులుగా ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఇతర పంటలు సాగు చేయడంవల్ల రైతులు ఎలాంటి లాభాలు సాధిస్తున్నారో తెలుసుకుంటున్నారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పంట సాగు మొదలుకుని పెట్టుబడి, మార్కెటింగ్ సదుపాయాలన్నింటినీ అడుగుతున్నారు.
విత్తనాలు వేసే ముందు జాగ్రత్తలు
వరి మడుల్లో విత్తనాలు వేస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మడుల్లో మురుగు నీరు బయటకువెళ్లే విధంగా చూడాలి. అకాల వర్షాలు, అనుకోకుండా నీరు ఎక్కువగా పారించినప్పుడు పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎర్ర నేలల్లో పల్లి వేసుకోవాలి. మినుములు, శనగలు నల్లరేగడి భూముల్లో సాగు చేయాలి. సాధ్యమైనంత మేర వరి కోతలు ముగిసిన వెంటనే విత్తనాలు చల్లుకోవాలి. ఆలస్యం చేస్తే పంట చివరి దశలో ఉష్ణోగ్రతలు పెరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. విత్తడానికి ముందు విత్తనాలను ఎండబెట్టుకోవాలి. వంద గింజలు తీసి మొలక శాతాన్ని పరీక్షించాలి. ఎండలో 80 నుంచి 85 మొలకలు వస్తేనే మంచి విత్తనాలుగా పరిగణించి వేయాలి.
మినుములు
ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, డబ్ల్యూబీజీ 26, ఎంబీజీ 207, పీయూ31, ఎల్బీజీ787 రకాలు అనుకూలం. డిసెంబర్ 10 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 కేజీల విత్తనాలు అవసరం. ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్‌కు మార్కెట్లో ధర రూ. 6500లు ఉంది. ఎకరానికి సాగు ఖర్చు రూ. 16,500లు కాగా రూ. 10 వేల వరకు నికర రాబడి వస్తుంది.
వరిని వదిలి..పల్లికి మరలి
వరి వేసుడేంది..? కేంద్రం వడ్లు కొంటలేదని బాధపడుడేంది..? కొనమని దళారులను బతిలాడుడేంది..? అనుకొని మార్కెట్లో మస్తు డిమాండ్ ఉన్న పల్లి సాగుకు సన్నద్ధమవుతున్నాడు గంభీరావుపేట మండలం రాజుపేట తండాకు చెందిన రైతు బానోతు చంద్రం. వానకాలంలో వరి పంటను వేసిన నేలను ఎడ్ల నాగలితో చిదగొట్టాడు.. భూమిని సాగుకు సిద్ధం చేసి పల్లి పంటను వేస్తున్నాడు. వ్యవసాయాధికారుల సూచన మేరకే ఈ యేడు పంటమార్పిడి చేయాలని నిర్ణయించుకున్నానని చంద్రం చెబుతున్నాడు. పల్లికి మార్కెట్ల మంచి గిరాకీ ఉన్నదని, అందుకే ఈ పంటను వేస్తున్నట్లు పేర్కొంటున్నాడు. కాగా, చంద్రం బాటలోనే తండాకు మరికొందరూ ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
-గంభీరావుపేట, డిసెంబర్ 12