
బతుకమ్మ చీరెలతో మా బతుకులు మార్చిండు
అమాత్యుడి చిత్రపటానికి చేనేత కార్మికుల పాలాభిషేకం
బీజేపీ విమర్శలపై చేనేత కార్మికుల ఆగ్రహం
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 12: మంత్రి కేటీఆరే తమ పాలిట దేవుడంటూ చేనేత కార్మికులు కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ చిత్రపటం వద్ద మరమగ్గాల పరిశ్రమల కార్మికులు కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఎన్నడూ చేనేత రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత తమ జీవితాల్లో మార్పులు తెచ్చారన్నారు. బతుకమ్మ చీరెలతో పాటు ప్రభుత్వ వస్ర్తాల తయారీ ఆర్డర్లు అందించడంతో కార్మికులకు చేతినిండా పని జేబు నిండా డబ్బులు వస్తున్నాయన్నారు. ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సిరిసిల్ల నేడు సిరులఖిల్లాగా వర్ధిల్లుతోందంటే అందుకు ముఖ్యకారణం కేటీఆరేనని కొనియాడారు. గతంలో నెలంతా పని చేసినా రూ.5వేలు కూలీ వచ్చేది కాదని, ప్రస్తుతం రూ.25 వేల వరకు సంపాదిస్తూ కార్మికులు తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. పనిలేని బీజేపీ నాయకులు తమ ఉనికి కోసమే మంత్రిపై పనికిమాలిన విమర్శలు చేస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేటీఆర్‌పై మరోసారి తప్పుడు మాటలు మాట్లాడితే తరిమికొట్టే రోజులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బింగి ఆనందం, చిలుక బాలకృష్ణ, రమేశ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.