టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు
వివరాలు సేకరిస్తున్న అధికారులు
కార్పొరేషన్, డిసెంబర్ 12: పట్టణాలు, నగరాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై రాష్ట్ర మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, అనుమతుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టీఎస్ బీపాస్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా నిబంధనల మేరకు భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయినా పట్టణాలు, నగరాల్లో అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పలు సమస్యలు వస్తుండడంతో పాటు రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్‌శాఖ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసే అధికారం ఉంటుంది. ఇందుకు పత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చివేస్తారు. ముఖ్యంగా బీ పాస్ విధానంలో అనుమతి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల వివరాలు సేకరిస్తున్నారు. తదనంతరం చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.
అక్రమ లే-అవుట్లపై..
నగరాలు, పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలు చేపట్టాలంటే ముఖ్యంగా అనుమతి ఉన్న లే-అవుట్లతోనే సాధ్యం అవుతుంది. కాగా, మున్సిపాలిటీల శివారు ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తుండడంతో భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే-అవుట్లపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సరైన రోడ్లు, ఇతర సదుపాయాలు లేకుండా చిన్న చిన్న ప్లాట్లు చేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే టీఎస్ బీ పాస్ విధానంలో అక్రమ లే-అవుట్లలోని ప్లాట్లల్లో ఎక్కడ కూడా నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు.