లేకుంటే బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వం
రైతు ధర్నాలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరుగలేరని, రైతులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో కలిసి మూడు గంటలకుపైగా ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో రవీందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఏడేళ్లకు బీజేపీ ప్రభుత్వం వల్ల రైతులు మళ్లీ రోడ్డు ఎకాల్సి వచ్చిందన్నారు. కులం, మతం తనకు లేదన్న ఈటల రాజేందర్ నేడు నియోజకవర్గ రైతులు పంటల కోసం ధర్నా చేస్తే ఎకడ ఉన్నారో చెప్పాలన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే తక్షణమే యాసంగి పంటల కొనుగోలుకు కేంద్రం నుంచి లేఖను తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీతో భవిష్యత్తులో రైతులకు మరిన్ని కష్టాలు రాబోతున్నాయని, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని, ఎరువులు, విత్తనాల సరఫరాను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ, వారం లోపల ఎఫ్‌సీఐ ద్వారా యాసంగి పంటలు కొనేలా ఉత్తర్వులు తీసుకురావాలని, లేదంటే ఢిల్లీకి వచ్చి తెలంగాణ రైతులు కొట్లాడతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నష్టం చేసే కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయాగణపతి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ అధ్యక్షులు గందె రాధిక, టీ రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు బర్మావత్ రమాయాదగిరి, వీ బాలకిషన్‌రావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆర్బీఎస్ సభ్యులు, టీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.