ఆత్మగౌరవం పెంచింది టీఆర్ఎస్సే
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్12: గత ప్రభుత్వాల హయాంలో నిరాధారణకు గురైన రజకులకు అండగా నిలిచింది, ఆత్మగౌరవం పెంచింది టీఆర్ఎస్ సర్కారేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉద్ఘాటించారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని బీఎస్ఆర్ గార్డెన్లో జరిగిన రజక సంఘం సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరుపాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని, సీఎం కేసీఆర్ ఇందుకు అంగీకరించారని చెప్పారు. చాకలి ఐలమ్మ రజకుల ఆత్మగౌరవానికి ప్రతిక అని పేర్కొన్నారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్ ప్రజలకు భవిష్యత్తు అని, ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కావాలని రజక కులస్థులు కోరారని, త్వరలోనే ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆధునిక దోబీ ఘాట్ కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. రజకుల సంఘం భవనం కోసం ఎకరం భూమి, కోటి రూపాయలు మంజూరు చేశామని, 26వ తేదీన భూమి పూజ జరుగుతుందని వివరించారు. వచ్చే ఉప ఎన్నికలో ఒకొకరు వంద ఓట్లు వేయించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని, డిజీల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.
హుజురాబాద్‌లో ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రజక సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్ ఉన్నారు. అలాగే సిటీ సెంట్రల్లో మైనార్టీ కళాశాలల ఔట్ సోర్సింగ్ జూనియర్ లెక్చరర్లతో, రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు, ఎల్ఐసీ ఎజెంట్లతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. స్వరాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ఔట్సోర్సింగ్ వాళ్లకు 30శాతం పీఆర్సీ ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.