బీజేపీ విధానాలతో ప్రజలకు కష్టాలు
ఆ పార్టీని నమ్మకండి
వ్యక్తి ముఖ్యం కాదు.. అభివృద్ధి చేసే పార్టీ ముఖ్యం
గెల్లు శ్రీనును భారీ మెజార్టీతో గెలిపించాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇష్టారాజ్యంగా గ్యాస్ ధరలు పెంచుతూ సబ్సిడీని మరిచిపోయిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నదని, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నదని మండిపడ్డారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజల అభివృద్ధి కోసం తపనపడే గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆయన పాలనను ప్రజలు ఆశీర్వదించి, హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఆదివారం విలాసాగర్ గ్రామంలో ఆరె సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, రైతు విమోచన సంఘం చైర్మన్ నాగూర్ల వెంకన్న, వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్ హాజరయ్యారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ తిప్పారపు బాబూరావు, ఆరె కులస్తులు టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే రమేశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు వచ్చాయో, ప్రజలు ఆలోచించాలన్నారు. 70 ఏండ్ల ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ, యువతకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. విలాసాగర్ గ్రామ అభివృద్ధి కోసం సీఎం రూ.1.12 కోట్లు మంజూరు చేశారన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నారనే విషయం ఆ నాయకులే చెప్పాలని ప్రశ్నించారు. ఆరే కుల సంఘ స్థలం కొనుగోలుకు రైతు విమోచన సంఘం చైర్మన్ రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, నాయకులు మనోహర్‌రావు, ఆరే కుల సంఘం నాయకులు మోరె రాజన్న, యాదగిరి, మల్లయ్య, శ్రీనివాస్ శివాజీ యువసేన నాయకులు నగేశ్, మధు, శివ పాల్గొన్నారు.
గెల్లును గెలిపించుకుంటం.
ఈటల మొన్నటి దాకా టీఆర్ఎస్లో ఉన్నడు. తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీలో చేరిండు. నేను కూడా వెళ్లిన. కానీ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని గుర్తించి తిరిగి పార్టీలో చేరిన. ఇల్లిల్లూ తిరిగి కేసీఆర్ సారు నిలబెట్టిన విద్యార్థి ఉద్యమ నాయకుడిని భారీ మెజార్టీ గెలిపించుకుంటం.
అభివృద్ధిని చూసే పార్టీలోకి..
సీఎం కేసీఆర్ సారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్లో చేరిన. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన. సీఎం సంక్షేమ పథకాలు ఎంతగానో నచ్చినయి. పార్టీ కోసం పని చేస్తూ, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటం.