జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు
259 మంది గైర్హాజరు
నిమిషం నిబంధన అమలుతో వెనుదిరిగిన పలువురు విద్యార్థులు
తిమ్మాపూర్, సెప్టెంబర్ 12: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వైద్య విద్యలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత (నీట్) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నీట్‌కు పది పరీక్ష కేంద్రాల్లో 5,379 మందికి ఏర్పాట్లు చేయగా 5120 మంది విద్యార్థులు హాజరు కాగా, 259 మంది గైర్హాజరైనట్లు నీట్ సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ లలితాకుమారి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నియమితులైన అబ్జర్వర్ల పర్యవేక్షణలో పరీక్ష కొనసాగింది. మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ చైతన్య డిగ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, కరీంనగర్ బైపాస్ రోడ్‌లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల, జగిత్యాల రోడ్డులోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల సీబీఎస్సీ, ఎస్సారార్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, హుజూరాబాద్‌లోని కమల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత నిమిషం నిబంధన అమలు చేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులను లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అలాగే ప్రతి కేంద్రంలో కొవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.