దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
నాగంపేట, గండ్రపల్లిలో పర్యటన
రూ.2కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జమ్మికుంట, ఆగస్టు12: పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఉద్ఘాటించారు. గురువారం గండ్రపల్లి, నాగంపేటలో పర్యటించారు. రూ.2కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, పార్టీలో పదవులన్నీ అనుభవించిన నాయకుడు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం బాధాకరమన్నారు. గ్రామాల అభివృధ్ధి కోసం సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు గొప్ప పథకంగా అభివర్ణించారు. ఎన్నికల్లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని, కొత్తగా ఎన్నికయ్యే పార్టీ ఎమ్మెల్యేను మీకు అప్పగిస్తామని చెప్పారు. కాగా, గండ్రపల్లికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సంఘాల నాయకులు 100మంది ఎమ్మెల్యే రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గండ్రపల్లికి చెందిన 40మందికి పింఛన్ పత్రాలను, ఒకరికి సీఎంఆర్ఎఫ్ రూ.62వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.