పల్లెపల్లెనా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు..
పంట క్షేత్రాల్లో ‘జై రైతు బంధు’ అక్షరాకృతులు
కరీంనగర్ నెట్వర్క్, జనవరి 12: కర్షకలోకం నవ్వుతున్నది. సీఎం కేసీఆర్ ఆది నుంచి ఎవుసానికి అండగా నిలుస్తూ, క్రమం తప్పకుండా ఠంఛన్‌గా పెట్టుబడి సాయం మంజూరు చేస్తుండడంపై మురిసిపోతున్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసింది. పంట క్షేత్రాల్లో ‘జై రైతు బంధు’ వంటి ఆకృతులు వేసి, ఎండ్ల బండ్లతో ర్యాలీలు తీసి వేడుక చేసుకున్నది.
రైతు బంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కోనరావుపేట మండల కేంద్రంలో రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి కమాన్ నుంచి బస్టాండ్ దాకా ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ తీయగా, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులను శాలువాలతో సన్మానించారు. కాగా, వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన జడ్పీ చైర్పర్సన్ అరుణకు టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు గంగసాని రమణారెడ్డి నాగలి బహూకరించి స్వాగతం పలికారు. చందుర్తి మండలం దేవునితండా గ్రామంలో సర్పంచ్ భూక్యా పంతుల్నాయక్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు కలిసి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య పంట క్షేత్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఎడ్లబండితో ర్యాలీ తీశారు. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో ఎంపీపీ మానస, ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, రైతులు కలిసి జీపీ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తిమ్మాపూర్ క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎంపీపీ కేతిరెడ్డి వనిత బహుమతులను అందజేశారు. ఓదెల మండలం గోపరపల్లిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చిత్రపటాలకు రైతులు, ప్రజాప్రతినిధులు
పాలాభిషేకం చేశారు. ధర్మారం మండలం నంది మేడారం ఆర్బీఎస్, టీఆర్ఎస్ అధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి సుమారు 50 ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్, రైతుబంధు జిందాబాద్, మంత్రి ఈశ్వర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రెండు బర్లు కొన్న..
మాది కోనరావుపేట మండలం మల్కపేట. నాకు ఊల్లె రెండున్నరెకరాల పొలం ఉంది. మా కుటుంబమంతా ఎవుసం మీదే ఆధారపడి బతుకుతున్నం. ఒకప్పుడు ఎవుసం అంటేనే ఏడుపొచ్చేది. కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వదాయె. చేన్లనే మంచం ఏసుకొని పండుకునేది. చీకట్ల ఏ పురుగు పూషో కుడితే పాణం పోతదని భయపడుకుంటనే ఉండేది. రాత్రి ఆ బాధ.. పొద్దందాకనేమో ఇత్తులు, ఎరువుల బాధ. రోజులకొద్దీ లైన్ల నిల్చుంటే కానీ దొరికేటియికాదు. అసొంటి కష్టం ఎవలికీ రావద్దు. పొలం పనులకన్నా ఏ కూలి పనిచేసుకుంటనే మంచిగుండు అనిపించేటిది. తెలంగాణ సర్కారు వచ్చినంక మా సీకటి బతుకుల్లో వెలుగులు వచ్చినయ్. సీఎం కేసీఆర్‌కు రైతుల బాధలు తెలుసు కాబట్టే ఇన్ని పథకాలు పెట్టిండు. 24 గంటలు కరెంటు వత్తుంది. ఇగ నీళ్ల గోసలేదు. ఎరువులు, ఇత్తుల కోసం లైను కట్టే పనేలేదు. అన్ని రకాల మాకు సౌలతులున్నయ్. సర్కారిచ్చిన రైతు బంధు పైసలు నాకు అక్కరకచ్చినయ్. పసలుకు రూ.12,500 వస్తయ్. అన్నీ జమ చేసి పదిరోజుల కిందనే రెండు పాడిగేదెలు కొన్న. వరి ఏసిన తర్వాత వచ్చిన గడ్డి గేదెలకు వేత్తున్న. ఇంకొన్ని రోజులైతే పాలు కూడా ఇస్తయ్. వాటిపైసలు పొట్టకు వాడుకుంటం. కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు ఢోకాలేదు. చానా సంతోషంగ ఉంది.-ఉత్తెం శ్రీనివాస్, రైతు మల్కపేట, కోనరావుపేట మండలం
అప్పుదెచ్చే బాధ తప్పింది..
నేను చిన్నతనంల నుంచి సూత్తున్న. పంట కాలం అచ్చిందంటే పెట్టుబడి పైసల కోసం షావుకార్ల చుట్టూ తిరిగేది. వాళ్లు అడిగినంత మిత్తి ఇత్తమని అప్పులు తెచ్చేది. పంటలు అమ్ముకోగా వచ్చిన పైసలు వాళ్లకే ముట్టజెప్పేది. ఇప్పుడు నాకు సర్కారు ఇస్తున్న రైతుబంధుతో ఏండ్ల నాటి గోస తీరింది. నా పేరిట 4.5 ఎకరాల భూమి ఉన్నది. పసలుకు రూ.22,500 బ్యాంకు ఖాతాల పడుతున్నై. ఆటితోనే ఇత్తనాలు, ఎరువులు కొంటున్న. ట్రాక్టర్ ఖర్సు లు, కైకిలోళ్ల కూళ్లు ఎత్లుతున్నై. పంటలు అమ్ముకున్నంక ఇన్ని పైసలు మిగులుతున్నై. రైతు బంధు రాకముందు చేతిల రూపాయి ఉండకపోతుండె. మీదికెళ్లి అప్పయ్యేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. నాలెక్కనే రైతులందరూ సంతోషంగా ఉన్నరు.-చెక్కబండి శ్రీనివాస్‌రెడ్డి, రెడ్డిపలిల(వీణవంక)
బాధలు తీరినై..
మాది జాఫర్‌ఖాన్‌పేట. ఊరి శివారున నాకు 1.30 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు ఎవుసం అంటే దుఃఖమచ్చేది. లాగోడి కూడా ఎల్లక అరిగోసపడేది. సీఎం కేసీఆర్ సార్‌తోనే ఎవుసం బాగుపడ్డది. రైతుల బాధలు తీరినయి. లేకుంటే రైతులంతా ఎవుసం ఇడిసిపెట్టి బతకపోయేటోళ్లు. కరెంట్ వస్తంది. నీళ్లున్నై. నాకు పసలుకు రూ.8,750 వస్తున్నై. ఏ బాధలేదు. పైసలు ఆసరైతున్నై. విత్తులు, మందులు కొంటున్న. ఇదొక్కటే కాదు రాష్ట్రం అచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ రైతుల వెంటే ఉంటండు. అనేక పథకాలు పెడుతూ ఏ లోటూ లేకుంట చూసుకుంటుండు. ఇంకా రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడద్దని రూ.5లక్షలు కూడా ఇయ్యవట్టే. సార్‌ను మర్సిపోం.-బోడకుంట్ల సదయ్య, జాఫర్‌ఖాన్‌పేట (కాల్వశ్రీరాంపూర్)