తాజాగా కంపెనీ బోర్డు ఆమోదం
పనులు త్వరగా పూర్తిచేయాలని సూచన
మార్చిలోగా టెండర్లు పూర్తి చేస్తాం: మేయర్ సునీల్‌రావు
కార్పొరేషన్, జనవరి 12:కరీంనగరానికి తీపి కబురు అందింది. ఇప్పటికే వందలాది కోట్ల నిధులతో ప్రగతి పరుగులు పెడుతుండగా, దానికి తోడు తాజాగా రూ.615 కోట్ల అభివృద్ధి పనులకు స్మార్ట్‌సిటీ కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. బుధవారం హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కరీంనగర్ స్మార్ట్‌సిటీ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ స్మార్ట్‌సిటీ కింద ప్రస్తుతం చేస్తున్న పనులతోపాటు నూతనంగా రూ.615 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు స్మార్ట్‌సిటీ కంపెనీ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్ స్మార్ట్‌సిటీ కంపెనీ బోర్డు మీటింగ్ జరుగగా, ఇందులో నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ సేవ ఎస్తావాత్, ఎస్ఈ నాగ మల్లేశ్వర్రావు, ఆర్వీ కన్సెల్టెన్సీ ప్రతినిధులు నేరుగా హాజరుకాగా, వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అర్బన్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఈఎన్సీ శ్రీధర్, స్మార్ట్‌సిటీ కంపెనీ సెక్రటరీ విజయ్, విద్యాధర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా నూతనంగా అడ్మినిస్ట్రేషన్ మంజూరైన అన్ని పనులను కలుపుకుంటే రూ.968 కోట్ల మేరకు చేరుతున్నాయి. వీటిలో ఇప్పటికే నగరంలో జరుగుతున్న రూ.353 కోట్ల అభివృద్ధి పనులు పోను నూతనంగా రూ.615 కోట్ల పనులకు అడ్మినిస్ట్రేషన్ మంజూరు ఇచ్చారు. కాగా, నిధులతో డంప్ యార్డు ప్రక్షాళన, 24 గంటల మంచినీటి సరఫరా, కమాండ్ కంట్రోల్ సిస్టం, నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ ఏర్పాటు, సీసీ సర్వెలెన్స్ కెమెరాల ఏర్పాటు, డిజిటల్ లైబ్రరీ, ఈ క్లాస్ రూంలు, సోలార్ రూప్‌టాప్‌తో పాటు వివిధ అభివృద్ధి పనులు చేయున్నారు.
నాణ్యతతో పనులు చేయాలి: కంపెనీ బోర్డు
స్మార్ట్‌సిటీ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కంపెనీ బోర్డు ప్రతినిధులు సూచించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించిన డిజైన్ల మేరకు అనుకున్న లక్ష్యంలోగా పనులను పూర్తి చేయించేలా చూడాలన్నారు. నగరంలో అత్యంత ప్రాధాన్యత క్రమంలో రూ.135 కోట్లతో చేపట్టే ప్రధాన మురుగు కాలువ పనులకు టెండర్లు పూర్తి చేసి వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ పనులపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సమావేశంలో సూచించారు. నగరంలో వివిధ డివిజన్లల్లో ఉన్న అంతర్గత రోడ్లను ఈ పథకంలో అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కార్పొరేటర్ల విన్నపాల మేరకు రూ.90 కోట్లతో వివిధ డివిజన్లల్లోనూ స్మార్ట్ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు. టెండర్లు పూర్తి చేసుకున్న అన్ని ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు.