కోటి లింగాలలో సౌకర్యాలు కల్పించాలి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, కోటిలింగాల ఆలయాల్లో పనుల పురోగతిపై సమీక్ష
ధర్మపురి/ వెల్గటూర్ జనవరి 12: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. రూ. 25 కోట్లతో కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి ఆలయంలో సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. బుధవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. అలాగే కోటిలింగాలలో 40 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో బోటులో విహరించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు.
ధర్మపురిలో రూ.2కోట్లతో నిర్మిస్తున్న రైతుబజార్, అలాగే రూ.20 లక్షలతో చేపట్టిన శారద మహిళా మండలి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. రూ.1 36 కోట్లతో చింతామణి చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేశామని, రూ.10 లక్షలతో ప్లాట్‌ఫామ్‌పై బెంచీల ఏర్పాటు పనులను సత్వరమే ప్రారంభించాలని సూచించారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న వివేకానంద విగ్రహం, పైలాన్ వద్ద సుందరీకరణ పనులను ప్రారంభించాలని కోరారు. అంబేద్కర్, గాంధీచౌక్. పటేల్ విగ్రహాల స్థానాల్లో క్యాంస్య విగ్రహాల ఏర్పాటు, ఫౌంటే న్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరా రు. రూ.2.60 కోట్లతో ఎన్‌హెచ్ 63 నుంచి ప్రభుత్వ దవాఖాన మీదుగా పుష్కర ఘాట్ల వరకు రహదారి విస్తరణ , మంగళి గడ్డ ఘాట్ వద్ద సుందరీకరణ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. అలాగే ఎన్‌హెచ్ 63 నుంచి కమలాపూర్ రోడ్డు వైపు గల అక్కపెల్లి రాజేశ్వరాలయం వరకు రహదారి విస్తరణ బీటీ రోడ్డు పనులు పూర్తి చేయించాలన్నారు. కమలాపూర్ రోడ్డు నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు సీసీ రహదారి నిర్మాణానికి రూ.61లక్షలు కేటాయించగా పనులు పూర్తి చేయాలన్నారు. అవసరమున్న ప్రాంతాల్లో కోత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, లూజ్‌వైర్లను సరిచేయాలని కోరారు.
అనంతరం ధర్మపురి ఆలయ అభివృద్ధికి తొలి విడుత రూ.46 కోట్లు మంజూరు కాగా, చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. వ్యాక్సినేషన్లో వేగం పెంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో కోటేశ్వరస్వామి ఆలయానికి ముప్పు ఉన్నందున, రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పారు. స్థపతుల సూచనల మేరకు ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు. కమాన్, పార్కు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఆయాచోట్ల ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, తహసీల్దార్ వెంకటేశ్, పీఆర్ డీఈ లక్ష్మణ్‌రావ్, ఏఈ చలపతి, భగీరథ డీఈ మురళి, గ్రిడ్ డీఈ రోహిత్, ఏఈ రాహుల్, జిల్లా క్షయనియంత్రణాధికారి డా. శ్రీనివాస్, వెల్గటూర్ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, ఆర్డీవో మాధురి, ఎఫ్ఆర్వో శ్రీనాథ్, బీఆర్వో సదాశివుడు, సర్పంచులు నక్క మౌనిక, బోడకుంటి రమేశ్, మారం జలంధర్ రెడ్డి, గంగుల నగేశ్, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి సత్యం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పోడేటి సతీశ్, ఆలయ కమిటీ చైర్మన్ పదిరే నారాయణరావు, ఈవో మారుతిరావు, ప్యాక్స్ చైర్మన్ గోలి రత్నాకర్, గూడ రాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు.