కలెక్టరేట్, ఆగస్టు 11: కులవృత్తులు చేసుకునే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ.లక్ష సాయం చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు ఇటీవలే రూ.12కోట్లు మంజూరయ్యాయి. దరఖాస్తుదారుల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తికాగా, మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారుల జాబితా సిద్ధం కాగానే చెక్కులను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కులవృత్తులు చేసుకుంటున్న బీసీ వర్గాలకు చెందిన వారు ఆధునిక పనిముట్లు కొనుగోలు చేసుకుని, వారి వృత్తిని మరింత అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్ధిక సాయం పథకాన్ని రెండు నెలల క్రితం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా, జిల్లావ్యాప్తంగా 19,096 దరఖాస్తులు వచ్చాయి. 15,042 మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికి రూ.లక్ష సాయం చేసేందుకు బీసీ కార్పొరేషన్‌కు సిఫారసు చేశారు. అయితే, వీరి ఆర్థిక పరిస్థితులను గమనించి ప్రాధాన్యమివ్వాలంటూ సీఎం కేసీఆర్ సూచించగా, అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వారి స్థితిగతులను అంచనావేస్తూ, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మొదటి విడతలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మందికి పంపిణీ చేయనుండగా, పథకం ప్రారంభ సమయంలో జూన్ 9న, జూలై 15న జిల్లా వ్యాప్తంగా 52 మందికి రూ. లక్ష సాయం చెక్కులు అందజేశారు. అత్యంత పేదరికంలో ఉండి, కులవృత్తి పని చేస్తున్న వారిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. ఇప్పటికే 95శాతానికి పైగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా వారిని కూడా శనివారం వరకు గుర్తించి, తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
సామాజికవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే…
రజక సామాజిక వర్గం నుంచి 5,027 దరఖాస్తులు రాగా 4,655 మందిని, కమ్మరి 752 మందికి గాను 709, కంసాలి 1232 మందికి గాను 1,181 మందిని, కంచరి 71మందికి గాను 68, కటిక 163 మందికి గాను 149, కుమ్మరి 1,655 మందికి గాను 1454, మంగళి 1571మందికి గాను 1509, మేదరి 474 మందికి గాను 451, మేర 597 మందికి గాను 569, పూసల 363 మందికి గాను 336, ఉప్పర 114 మందికిగాను 105, వడ్డెర 1,497 మందికి గాను 1,445, వడ్రంగి నుంచి 1796 దరఖాస్తులు రాగా 1683, విశ్వబ్రాహ్మణ 110 రాగా 105, ఎంబీసీల నుంచి 546 రాగా 493 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.