
కోర్టు చౌరస్తా, డిసెంబర్ 11: లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎంజీ ప్రియదర్శిని కోరారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల న్యాయ సేవా సదన్ భవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎంజీ ప్రియదర్శిని మాట్లాడుతూ, రాజీ పడిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలు, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఇతర కేసులను ఇరుపక్షాల సమ్మతితో జాతీయ లోక్ అదాలత్‌లో పరిషరిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాజీకి గుర్తించిన 3500 కేసుల్లో కక్షిదారులకు నోటీసులు పంపించినట్లు పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిషరించుకుంటే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని చెప్పారు. కక్షసాధింపు, మాట పట్టింపులతో కేసులు పెట్టవద్దని కక్షిదారులకు సూచించారు. కోర్టులో కేసులు తేలడానికి ఏళ్లు పడుతుందని, అందుకే లోక్ అదాలత్‌లో పరిషరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ సుజయ్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రావు, ఏసీపీ మదన్‌లాల్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.