నాబార్డు ఏజీఎం అనంత్
రామడుగు మండలం తిర్మలాపూర్‌లో పంట చేలు సందర్శన
రామడుగు, డిసెంబర్ 11: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నాబార్డు ఏజీఎం అనంత్ రైతులకు సూచించారు. రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా రైతు కట్ల లక్ష్మీకాంతమ్మ సాగు చేసిన బంతి చేను, యువరైతు కట్ల శ్రీనివాస్ సాగు చేసిన అంజీర, బెండ తోటలను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా నాబార్డు ఏజీఎం అనంత్ మాట్లాడుతూ, రైతులు వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి చేస్తే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ వ్యవసాయం, ఉద్యానవన పంటలు సాగు చేసుకోవాలన్నారు. అంజీర సాగులో మెళకువలు, పంట దిగుబడి, మార్కెట్ సౌకర్యం గురించి రైతు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రైతులు తిర్మలాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకొని ప్రభుత్వ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాబార్డు ప్రతినిధి మనోహర్‌రెడ్డి, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు పొన్ను లింగన్న, కట్ల మోహన్‌రెడ్డి, పెంచాల రాజిరెడ్డి, సాయిల్ల ఐలయ్య, ఎనగంటి రాజమల్లు, పొన్ను మల్లయ్య, ఎనగంటి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.