అనేక పథకాలతో అండగా రాష్ట్ర సర్కారు
మంత్రి కొప్పుల ఈశ్వర్
పందిరి సాగు పథకం లబ్ధిదారులకు కరీంనగర్లో అవగాహన
వెల్గటూర్, డిసెంబర్ 11: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, అనేక పథకాలతో అండగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పందిరి కూరగాయల సాగు పథకానికి ఎంపికైన 60 మంది మహిళలకు శనివారం కరీంనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా దళితుల అభివృద్ధి కోసం ఎవరూ ఆలోచించలేదని, దీంతో వారు చీకట్లో మగ్గారని విచారం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఇంకా అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర సర్కారు పందిరి కూరగాయల సాగు పథకానికి ధర్మపురి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎకరాలో పందిరి కూరగాయల సాగుకు అయ్యే ఖర్చులో 75-85 శాతం దాకా సబ్సిడీని అందిస్తూ ప్రోత్సహిస్తున్నదని వివరించారు. దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. ఈ విధానంతో అర ఎకరంలో ఐదు ఎకరాలకు సమానంగా ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఇక్కడ మండల నాయకులు, మహిళలు ఉన్నారు.