కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆది నుంచీ అన్నదాత పక్షాన నిలుస్తున్న అధికార టీఆర్ఎస్ మరోసారి వారి కోసం పోరుబాట పట్టింది. ప్రతి సీజన్లో పంజాబ్ వంటి రాష్ర్టాల నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణ నుంచి యాసంగి దిగుబడులు కొనేందుకు నిరాకరిస్తుండడంతో అమీతుమీ తేల్చుకునేందుకు సమాయత్తమైంది. స్థానిక బీజేపీ నాయకత్వం మాత్రం యాసంగిలో వరి సాగు చేయాలని తప్పుదోవ పట్టిస్తుండడం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న నేతలు సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్న తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో గులాబీ దండు కదనరంగంలోకి దిగనున్నది. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనున్నది.
యాసంగి వడ్లు కొనలేమని తేల్చి చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ కొట్లాటకు దిగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అష్టకష్టాలు పడిన రాష్ట్ర రైతాంగానికి స్వరాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు అందించి, సాగుకు అవసరమైన నీటి వసతిని కల్పించి, పెట్టుబడి కోసం రైతుబంధు వంటి వినూత్న పథకాలను తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని సంపూర్ణ వ్యవసాయ క్షేత్రంగా మలచగలిగింది. దీంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా వడ్ల దిగుబడి వస్తోంది. దీంతో రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి యాసంగి వడ్లను కొనలేమని కొర్రీలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగి కేంద్రానికి మంచి మాటతో చెప్పి చూశారు. కానీ, ససేమిరా ఒప్పుకోక పోవడంతో రైతుల పక్షాన నిలబడిన టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలో జరిగే ధర్నాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హాజరు కానున్నారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఎక్కడో ఒక చోట పాల్గొననున్నారు. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొంటున్నారు.
ఎక్కడి నాయకులు అక్కడే..
ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. మంథనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, హుజూరాబాద్‌లో నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా, మిగతా అన్ని నియోజవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఆందోళనలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించుకోగా, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ధర్నాలకు ఎలా సిద్ధం కావాలనే విషయాలపై ముఖ్య నాయకులతో చర్చించుకున్నారు. ప్రతి నియోజవర్గంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాలు చేయాలని, ఇందుకు పెద్ద ఎత్తున రైతులను తరలించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుమతి తీసుకుని మరీ ఆందోళనలకు దిగుతున్నారు. ప్రతి నియోజవర్గంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ధర్నాలు కొనసాగుతాయి.