కార్పొరేషన్, నవంబర్ 11: ‘రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముందా.. ఉంటే వానకాలం, యాసంగి బియ్యం కొంటమని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురండి..’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం వానకాలంలో పండిన ప్రతి గింజనూ కొంటామని ప్రకటించి, ఇప్పటికే కొనుగోలు చేస్తుంటే బీజేపీ వానకాలం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నాలు ఎందుకు చేస్తుందో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం వానకాలం ధాన్యం కొనబోమని ఆర్డర్ ఏదైనా ఇచ్చిందా? అని నిలదీశారు. కొనుగోలు చేయలేదని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. ధాన్యం కోనుగోలు చేయడం లేదని అంటున్న ఏ ఒకరైతునైనా చూపిస్తే తానే స్వయంగా బాధ్యత తీసుకొని వచ్చి వడ్లు కొనిపిస్తానని చెప్పారు. ఏడేళ్లుగా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకున్నా రాష్ట్రం మాత్రం ప్రతి గింజనూ కొంటుందన్నారు. గురువారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వానకాలం ధాన్యం కొనుగోలు కో సం రాష్ట్రంలో 6663 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 3550 కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని సేకరిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు.
సుమారుగా రూ. వెయ్యి కోట్ల మేరకు లావాదేవీలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు తేమ శాతం 17 కన్నా తకువ ఉన్న వడ్లను ఐదు నిమిషాల్లోనే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు ధర్నాలు చేసే వేదిక తప్పుగా ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. వారు యాసంగి ధాన్యం కొనాలని ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సలహా ఇచ్చారు. బీజేపీ పూర్తిగా అబద్ధాల మీద బతుకుతుందని దుయ్యబట్టారు. దీనికి ఇప్పుడు బీజేపీ చెబుతున్న విషయమే నిదర్శనమన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డికి ఎక్కడైనా వానకాలం ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు చూపిస్తారా? అని నిలదీశారు. ఓ వైపు కొనుగోళ్లు సాగుతుంటే ఇప్పుడు ధర్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వానకాలంలో ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, దాని నుంచి వచ్చే బియ్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని బీజేపీ నాయకులు ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి ఇళ్ల ముందు రైతులతో కలిసి తాము ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఏం కేసీఆర్ చేపట్టిన రైతు అనుకూల విధానాలతో పంట దిగుబడులు పెరిగాయని, ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్న తెలంగాణ రైతుల్ని చూసి కడుపు, కళ్లు మండి బీజేపీ యాసంగి ధాన్యం కొనబోమని ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు నిస్సిగ్గుగా ధర్నాలు చేయడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారం పంట కొనుగోళ్ల బాధ్యత కేంద్రానిదేనన్నారు. యాసంగి పంట కొంటామని కేంద్రం జీవో ఇచ్చేదాకా తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే వానకాలం, యాసంగి పంట పూర్తిగా బియ్యం రూపంలో కొంటామని కేంద్రం, ఎఫ్‌సీఐ నుంచి ఆర్డర్ తీసుకురావాలన్నారు.
రైతులు బీజేపీ ఝూటా మాటలు నమ్మెదని సూచించారు. రైతులపై ప్రేమ ఉన్నవారు యాసంగి పంటను కొనబోమని ఆర్డర్ ఇచ్చిన కేంద్రంపై చేసే పోరాటానికి అందరూ ముందుకు వచ్చి సంఘీభావం తెలపాలన్నారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే నీచపు ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలెవరైనా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి వానకాలం, యాసంగి బియ్యం మొత్తం తీసుకునేలా చేయగలరా అని ప్రశ్నించారు. తాను ఆ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యతతో వానకాలం పంట కొంటామని సృష్టంగా హామీ ఇస్తున్నామన్నారు. కరోనా సమయంలోనూ రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రతీ గ్రామంలో ఉండే విధంగా గతంలో 6500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి మరిన్ని పెంచి 6663 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఇప్పటికీ పావుశాతం కోతలు మాత్రమే జరిగాయని, వరి కోతలు ఎట్లెట్లా జరిగితే ఆవిధంగా రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తున్నారని, అంతే వేగంగా కోనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 3500 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. యాసంగి పంట మేం కొనబోమని ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి చెబుతున్నారని, మరోవైపు బండి సంజయ్ దానికి విరుద్ధంగా యాసంగిలో రైతుల్ని వరి వేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నేతలే విభిన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలతో రైతుల్ని బీజేపీ మోసం చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు జుటా, దొంగ మాటాలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయన్నారు.
జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
కరీంనగర్ జిల్లాలో ఈ సారి గతం కంటే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువ వస్తుందని తాము అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో 351 కేంద్రాలకు గాను ఇప్పటికే 346 కేంద్రాలను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా ఇప్పటికే 93,172 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 12,000 రైతుల నుంచి రూ. 183 కోట్ల విలువ గల ధాన్యం కొన్నామన్నారు. ఈ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పారదర్శకంగా ఉన్నాయని, కావాలంటే చూసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం వానకాలం పంట మొత్తం బియ్యాన్ని, రాబోయే యాసంగిలో వరిని కొనిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై.సునీల్‌రావు, నాయకులు లక్ష్మయ్య, చల్ల హరిశంకర్, బండారి వేణు, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.