టీఆర్ఎస్ ధర్నాకు రైతులు వేలాదిగా తరలిరావాలి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మధురానగర్‌లో ధర్నాస్థలి పరిశీలన
గంగాధర, నవంబర్ 11: ‘రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది.. అందుకే దొడ్డు వడ్లు కొనబోమని పేచీలు పెడుతున్నది.. ఇక్కడి బీజేపీ నాయకులు సోయిలేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నరు’ అంటూ చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలుపై సెంట్రల్ సర్కారు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గంగాధరలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేస్తున్నామని చెప్పారు. రైతులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని మధురానగర్‌లో ధర్నాస్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి చెంది న బీజేపీ నాయకులకు దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఒప్పించాలని, వెంటనే జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ధర్నాకు స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరుకానున్నారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ధర్నాకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బోయినిపల్లి నుంచి వచ్చే వాహనాలను మల్లాపూర్ రోడ్డులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద, రామడుగు, చొప్పదండి వైపు నుంచి వచ్చే వాహనాలను మధురానగర్ జూనియర్ కళాశాల మైదానంలో, కొడిమ్యాల, మల్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను జగిత్యాల రోడ్డులోని అయ్యప్ప ఆలయం వద్ద, గంగాధర మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కురిక్యాల సమీపంలోని శుభమస్తు ఫంక్షన్‌హాల్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎండీ నజీర్, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, సముద్రాల అజయ్, సుంకె అనిల్, మధిరె మధు ఉన్నారు.