దళితబంధుపై అనుమానాలు వద్దు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
మామిడాలపల్లిలో పథకంపై అవగాహన
వీణవంక, అక్టోబర్ 11: దళితులపై బీజేపీది కపట ప్రేమ అని, దళితబంధుపై ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం మండలంలోని మామిడాలపల్లి ఎస్సీ కాలనీలో నిర్వహించిన దళితబంధు అవగాహన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో దళితులను ఏ నాయకుడూ పట్టించుకోలేదని, అన్ని రంగాల్లో వెనుకబడిన దళిత సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారని తెలిపారు. పథకంపై ఎవరికీ అనుమానాలు వద్దని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పథకానికి అంకురార్పణ జరిగిందని, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, మల్లేశ్, లింబాద్రి తదితర మేధావులతో చర్చించారని గుర్తు చేశారు. మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకం అమలవుతుందని, తర్వాత రాష్ట్రమంతటికీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఒకసారి ఖాతాలో రూ.10 లక్షలు పడిన తర్వాత సీఎం కూడా వాపస్ తీసుకోవడం సాధ్యంకాదని పేర్కొన్నారు. బీజేపీ దళితుల మేలు కోరేపార్టీ అయితే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడం మినహా ఏమీ చేయలేదని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోదీ మోసం చేసిన విషయాన్ని మరువద్దన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కనీసం లక్ష ఉద్యోగాలైనా ఇవ్వకపోగా ఉన్నవి ఊడగొట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్‌రెడ్డి, విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, సింగిల్‌విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచ్ బండ సుజాత-కిషన్‌రెడ్డి, ఎంపీటీసీ మూల రజిత-పుల్లారెడ్డి, ఉపసర్పంచ్ సత్యనారాయణ, నాయకులు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, తాండ్ర శంకర్, సుధాకర్, పోతుల సురేశ్, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.