ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఇరవై ఏండ్లుగా తిరిగినా పట్టని నాటి నేతలు
అడిగితే ఈసడింపులు.. వెకిలి నవ్వులు
నేడు కోరిన వెంటనే కార్యరూపం
కాకతీయ కాలువ పక్కన పదెకరాలు కేటాయింపు
నెల రోజుల్లోనే పనులు ప్రారంభం
మెకానిక్‌లకు ప్లాట్లతోపాటు శాశ్వత షెడ్లు
మొదటగా 15 మందికి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పట్టాలు
మిగతా వారికి అందించనున్న అధికారులు
347 మంది ఆటోమొబైల్ అసోసియేషన్ కార్మికుల్లో ఆనందం
నెరవేరిన రెండు దశాబ్దాల కల
కరీంనగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్ : ఆటోనగర్‌కు ప్రభుత్వ స్థలం కేటాయించాలని రెండు దశాబ్దాల పోరాటం.. ఏడెనిమిది నెలల క్రితం వరకు ఎన్నో విజ్ఞప్తులు.. కాళ్లరిగేలా తిరిగిన కనికరించని నాయకులు.. పైగా సాధ్యంకాని పనులెందుకు అడుగుతరంటూ ఈసడింపులు.. మీరు ఓట్లు వేయకపోతే గెలువనా? అంటూ వెక్కిరింపులు.. మొఖం మీదే వెకిలి నవ్వులు.. అయినా అవన్నీ భరిస్తూ హుజూరాబాద్ ఆటోమొబైల్ కార్మికులు పట్టువదలని ప్రయత్నమే చేశారు. కానీ, ఫలించలేదు.
సరిగ్గా నెల క్రితం ఆటోమొబైల్ నాయకులకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను కలిసే అవకాశం వచ్చింది. అప్పుడే తమ సమస్యను విన్నవించుకోగా, ఆటోనగర్‌కు హామీ దొరికింది. వెనువెంటనే కాకతీయ కాలువ పక్కన పదెకరాల స్థలం కేటాయించడంతోపాటు తాజాగా ‘కేసీఆర్ ఆటోనగర్’కు అంకురార్పణ జరిగింది. శనివారం మంత్రులు భూమిపూజ చేసి, మొదటగా 15 మందికి పట్టాలు అందజేశారు. మిగతా వారికి అధికారులు అందజేయనున్నారు. లబ్ధిదారులకు స్థలంతోపాటు శాశ్వత షెడ్లు నిర్మించి ఇవ్వనుండగా, ఇరువై ఏండ్ల కల నెరవేరడంతో 347 మంది కార్మికులు ఆనందంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని, గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుక ఇస్తామని చెబుతున్నారు.
హుజూరాబాద్ పట్టణంలో 347 మంది కార్మికులు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఇండ్ల మధ్యే దుకాణాలు ఉండడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. వాయు, శబ్ధ కాలుష్యంతో అవస్థలకు గురయ్యారు. అద్దె మడిగల్లోనే షాపులు నిర్వహించాల్సి రావడంతో ఆదాయం సైతం అంతంతమాత్రంగానే ఉండేది. కొన్నిసార్లు గత్యంతరంలేని పరిస్థితుల్లో రోడ్డుపైనే బిజినెస్ చేయాల్సి వచ్చేది. దీంతో పోలీసులు సైతం అనేక సార్లు కేసులు నమోదు చేయడంతో కోర్టులు, ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక్కడి కార్మికులు 20 ఏళ్లుగా దుకాణాల కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నాడు ఈటలకు ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆపై ఈసడించుకునేవారని ఆటోమొబైల్ అసోసియేషన్ కార్మికులు చెబుతున్నారు. రాజేందర్ రాజీనామా తర్వాత మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను కలిసే అవకాశం రావడంతో తమ సమస్యను విన్నవించుకున్నారు. నెల కిత్రం దుకాణాలకు స్థలం కేటాయించాలని అడిగిన వెంటనే అమాత్యులు స్పందించారు. సకల సౌకర్యాలతో కేసీఆర్ ఆటోనగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆ వెంటనే ఆటోనగర్‌కు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించగా, కరీంనగర్‌రోడ్డులో కాకతీయ కాలువ పకన పదెకరాల స్థలాన్ని చదును చేశారు. అందులో మోటర్ ఫీల్డ్‌కు చెందిన 11 సంస్థలు ఉండగా, మోటర్ మెకానిక్, ట్రాక్టర్, లారీ, వర్‌షాప్, ట్రాలీ, ఆటో, గ్యాస్ వెల్డింగ్, వెల్డర్, హార్వెస్టర్‌కు చెందిన వ్యాపారులకు ఈ స్థలాన్ని కేటాయించారు. శనివారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. మొదటగా 15 మందికి హరీశ్‌రావు పట్టాలు అందించారు. 347 కుటుంబాలకు ప్లాట్లు కేటాయించడమే కాకుండా శాశ్వతంగా షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం టీఎస్ఐఐసీ ద్వారా 3కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా వారికి పట్టాలు అధికారులు త్వరలోనే అందించనున్నారు. ఆటోనగర్‌లో రోడ్లు, కరెంట్ సౌకర్యం, అధునాతనమైన టాయ్లెట్లు, మంచినీటి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంతం చిన్నపాటి ఇండస్ట్రీయల్ హబ్‌గా మారే అవకాశమున్నది. కాకతీయ కాలువ ఏరియా కొత్త శోభ సంతరించుకోనున్నది. అంతే గాకుండా పట్టణవాసులకు ఒకేచోట ఆటోమొబైల్ షాపులు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది.
ఈటల పట్టించుకోలె..
30 ఏండ్లుగా చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లు ఎక్కడెక్కడో దుకాణాలు పెట్టుకొని కష్టాలు పడ్డం. గిరాకీలేక మస్తు నష్టపోయినం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలె. ఇప్పుడు మంత్రులు గంగుల, హరీశ్‌రావును కలిసిన వెంటనే స్పందించిన్రు. వెంటనే స్థలం చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చిన్రు. ఇప్పుడు ఇంత తొందరగా పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నది.
అడిగిన వెంటనే..
నేను హుజూరాబాద్‌ల 30 ఏండ్ల సంది ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్న. మా సమస్యలు పరిష్కరించాలని అప్పటి నాయకులను అడిగినం. ఏనాడు పట్టించుకోలె. ఇప్పుడు మంత్రులను కలిసిన వెంటనే స్థలం కేటాయించిన్రు. భూమి పూజ చేసిన్రు. టీఆర్ఎస్ సర్కారుతోనే మెకానిక్‌లకు గుర్తింపు దక్కింది.
అండగా నిలుస్తం..
ఇంతకుముందు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరుకలేదు. ఇప్పుడు మంత్రులు ఆటోమొబైల్ షాపుల కోసం ఒకే దగ్గర పదెకరాలు స్థలం కేటాయించడం సంతోషంగా ఉన్నది. మాకు మేలు చేసిన సర్కారుకు అండగా నిలుస్తం.
మీరు ఓట్లు ఏయకపోతే గెలువనా అన్నడు..
ఆటోనగర్ స్థలం కోసం ఏండ్ల సంది తిరుగుతున్నం. ఈటల రాజేందర్ దగ్గరికి పోతే ఎన్నడూ పట్టించుకోలె. పైగా మీరు ఓట్లు వేయకపోతే గెలువనా? అని వెక్కిరించిండు. ఇట్ల అంటున్నడేంది అని బాధపడ్డం. అవన్నీ మనుసులోనే పెట్టుకున్నం. ఎలాగైనా ఆటోనగర్ సాధించుకోవాలని అనుకున్నం. ఆ దేవుడి దయతో మా పోరాటం ఫలించింది. టీఆర్ఎస్ సర్కారు ఆటోనగర్ కోసం స్థలం కేటాయించింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు రుణపడి ఉంటం. కేసీఆర్ నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి మా తరఫున బహుమతి ఇస్తం. తెలంగాణ సాధించుకున్నట్లే గెల్లు శ్రీనివాస్ విజయం కోసం మరోసారి ఉద్యమిస్తం. – నవీన్, వెల్డింగ్ మెకానిక్