ఇప్పుడు ప్రజా వ్యతిరేక పార్టీలో చేరి ఏం చేస్తడు
ఆయనతో ఏం ప్రయోజనం లేదు
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం
ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం
మంత్రి కొప్పుల ఈశ్వర్.. జమ్మికుంటలో పర్యటన
జమ్మికుంట, సెప్టెంబర్ 11: “ఈటల రాజేందర్‌తో ఒరిగేదేం లేదు. ఇన్నేండ్ల పాలనలో హుజూరాబాద్ ప్రజలకు ఏం చేసిండు. సమస్యల్లోకి నెట్టిండు. ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీలో చేరి ఏమో చేస్తానంటున్నడు. ఆయనతో ఏం కాదు.. అప్పుడు చేయనోడు ఇప్పుడు చేస్తడా. మీరే ఆలోచించండి’ అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన జమ్మికుంటలో పర్యటించారు. 16వ వార్డులోని ప్రజల కోరిక మేరకు పోచమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.10లక్షల మంజూరు పత్రాన్ని అందజేశారు. పోచమ్మ గుడి నిర్మాణం కోసం భూదానం చేసిన హర్షవర్ధన్‌ను అభినందించారు. అనంతరం మెకానిక్, మార్బుల్ యూనియన్లను వేర్వేరుగా కలిశారు. సమస్యలను విన్నారు. సదరు సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున మంజూరు చేసిన పత్రాలను ఆయా యూనియన్ నాయకులకు అందించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యమని, అందుకు సీఎం కేసీఆర్ ప్రజలందరి ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు పాటుపడుతున్నారని చెప్పారు. సమస్యలేవైనా పరిష్కరించేందుకు ముందుంటామని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, అభివృద్ధికి చిరునామాగా జమ్మికుంట మున్సిపల్‌ను చేయాలని చెబుతున్నారని తెలిపారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికే మద్దతు పలుకాలని కోరారు. రాబోయే ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అమాత్యుడి వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు, ఆయా సంఘాల నాయకులు, సభ్యులు ఉన్నారు.