జనం కోసం జైలుకెళ్లిన నాయకుడు శ్రీనివాస్
గుండెల మీద తన్నిన వ్యక్తి ఈటల..
నీతి తప్పిన రాజేందర్ కావాల్నా..? ఉద్యమ నేత శ్రీనివాస్ కావాల్నా..?
హుజూరాబాద్ ప్రజలే తేల్చుకోవాలి
ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
భారీగా తరలి వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
హుజూరాబాద్ నుంచి ఇల్లందకుంట వరకు భారీ బైక్ ర్యాలీ
పాల్గొన్న మంత్రులు కొప్పుల,గంగుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
గులాబీమయమైన హుజూరాబాద్, జమ్మికుంట
దారి పొడవునా శ్రేణుల నినాదాలు
వీణవంకలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం చెక్కుల పంపిణీ
ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలు నిర్మిస్తామని హామీ
కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్/ తెలంగాణచౌక్ : ‘జనం కోసం జైలు కెళ్లిన నాయకుడు గెల్లు శ్రీనివాస్ అయితే.. రాజకీయ ఓనమాలు నేర్పిన కేసీఆర్ గుండెలపై తన్నిన వ్యక్తి ఈటల రాజేందర్.. నీతి తప్పిన ఈటల కావాలా..? ఉద్యమ నేత శ్రీనివాస్ కావాలా..? హుజూరాబాద్ ప్రజలే తేల్చుకోవాలి. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించండి.. ఈటల రాజేందర్ వదిలేసిన పనులన్నీ చేసిపెడుతాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇల్లందకుంటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ, వీణవంకలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు హుజూరాబాద్ నుంచి జమ్మికుంట మీదుగా ఇల్లందకుంట వరకు వేలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించాయి. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు చేసిన నినాదాలతో హుజూరాబాద్, జమ్మికుంట దారులు హోరెత్తాయి.
సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించాలని హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి మంత్రి హరీశ్‌రావు చేశారు. ప్రజల కోసం జైలుకు వెళ్లిన నాయకుడని, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి పలు సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనకు ఉందని స్పష్టం చేశారు. గెల్లు గెలిస్తే ఈటల వదిలేసిన అనేక పనులు చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ఆరేండ్ల కింద సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రజల కోసం మంజూరు చేసిన 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నా బిల్లులు ఇప్పిస్తామని అన్నారు. రూ.10 కోట్లతో రామచంద్ర ఆలయాన్ని తీర్చిదిద్దుతామని, ఆలయ రాజ గోపురం కానీ, ఫంక్షన్‌హాల్ గాని దేవాలయంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు ఉన్నా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రెండు గుంటల భూమి మాత్రమే ఉన్నదని, రెండు గుంటల భూమి ఉన్నోడు 200 ఎకరాల భూమి ఉన్నోనితో కొట్లాడుతున్నాడని అన్నారు. ఆయనకు హుజూరాబాద్ ప్రజలే ధైర్యమని చెప్పారు. హుజూరాబాద్ నుంచి ఇల్లందకుంట వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ కార్యకర్తలు కనబర్చిన ఉత్సాహం చూస్తుంటే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అవ్వ అడిగినదానికి సమాధానం చెబుతా..
సభలో ఉన్న మధునమ్మ అనే మహిళ డబుల్ బెడ్రూం గురించి ప్రశ్నించగా.. మంత్రి హరీశ్‌రావు తనదైన సమాధానం ఇచ్చారు. ‘అందరి మనసులో ఉన్నది గానీ.. మధునమ్మ ధైర్యం చేసి అడిగింది.. కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి, నీళ్లు, 24 గంటల కరెంటు.. మంచిగనే ఇచ్చిండ్రు గానీ డబుల్ బెడ్రూం ఇల్లు సంగతి మాట్లాడుతలేరని.. దీని గురించి కూడా చెబుతా.. ఆరేండ్ల కింద సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు మంజూరు చేసిండు. అందరి నియోజకవర్గాల్లో మంచిగ కట్టి పేదోళ్లందరికి ఇచ్చినం. ఇక్కడ మాత్రం ఎందుకు పూర్తి కాలేదో మీరే అర్థం చేసుకోవాలి.’ అని మంత్రి సూచించారు. జమ్మికుంట నుంచి వీణవంకకు వచ్చే రోడ్డు గురించి కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నాలుగైదు సార్లు కారులో కూర్చుంటే చెప్పారని, తెల్లని అంగీ వేసుకుని ప్రయాణం చేస్తే నల్లగా మారుతుందని చెప్పారన్నారు.
ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్ట లేదు
సహచర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ 3,500, తుమ్మల నాగేశ్వర్ రావు 2,700, తాను 3,400 ఇండ్లు కట్టించి పేదలకు ఇస్తే, ఈటల రాజేందర్ ఒక్కటి కూడా కట్టించలేదని, పదవిలో ఉన్నప్పుడే చేయలేని రాజేందర్ రేపు గెలిస్తే ఇండ్లు కట్టించగలుగుతాడా..? ఆలోచించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ని గెలిపిస్తే ఏం చేశారని, ఒక్క ఊరిలోనైనా రూ.10 లక్షల పని చేయించగలిగాడా..? అని ప్రశ్నించారు. ఈటల రాజేందరే గడియాలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, కుంకుమ భరణిలు, చెత్తిర్లు, సెల్ ఫోన్లు పంచుతున్నాడని, గతంలో ఆరు సార్లు గెలిచినపుడు ఒక్క సారైన పంచకపోతివని ప్రశ్నించారు.
మాటలు చెప్పేటోళ్లం కాదు.. చేసేటోళ్లం..
తాము మాటలు చెప్పటోళ్లం కాదని, పనులు చేసేటోళ్లమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. వీణవంకలో ఆయన మాట్లాడుతూ ‘మీరు అడుగలేదు కానీ.. నాకే బాధ అనిపించి ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టే విషయం మీకు చెప్పబోతున్నా. ఈ మండలంలో 26 గ్రామాలుండగా కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే మహిళా సంఘ భవనాలున్నాయని మొన్నామధ్యన ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ వనమాల కలిసినప్పుడు చెప్పారు. నేను చాలా ఆశ్చర్య పోయిన. నా నియోజకవర్గం ప్రతి ఊరిలో మహిళా సంఘ భవనం ఉంటుంది. 24 గ్రామాల్లో మీరు అడగకముందే మహిళా సంఘ భవన నిర్మాణం కోసం రూ.4 కోట్ల కాగితం తీసుకొని వచ్చా. శ్రావణమాసం కూడా ప్రారంభమైంది. పనులు కూడా మొదలు పెట్టడానికి మన జడ్పీటీసీ, ఎంపీపీ వచ్చి కొబ్బరికాయలు కొడుతరు. ఆరు నెలల్లో పూర్తి చేసుకుందాం’ అనగానే మహిళలు చప్పట్లతో అభినందించారు.
ఆత్మవంచన చేసుకున్న ఈటల..
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆత్మవంచన చేసుకున్నాడని విమర్శించారు. తన రక్తంలో అంతా లెఫ్టిజం ఉందని చెప్పుకునే రాజేందర్ రైటిజం పార్టీలో చేరి తానే ఆత్మ వంచన చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీకి వెళ్లిన తర్వాత కొత్త భాష నేర్చుకుంటున్నాడని, ఆయనకు అన్నం పెట్టి రాజకీయ అక్షరాలు నేర్పి, నాయకుడిగా తయారు చేసి, ఆరు సార్లు ఎమ్మెల్యేను చేసి, రెండు సార్లు మంత్రిని చేసిన కేసీఆర్‌ను బట్టుకుని ‘రా’ అని అనవచ్చా అని ప్రశ్నించారు. ‘ఒరేయ్ హరీశ్ దమ్ముంటే రారా’ అంటూ తనపై కూడా అనుచితంగా మాట్లాడాడని, తాను ఆయనలాగా సంస్కార హీనున్ని కాదని చెప్పారు. ఇప్పటికీ రాజేందర్ గారు అని సంభోదిస్తామని అన్నారు. ఓటమి భయంతోనే ఆ విధంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
పేదింటి ఆడబిడ్డలకు అండ :మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వీణవంకలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీతో పాటు స్త్రీనిధి రుణాల పంపిణీలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆడబిడ్డల క్షేమం కోరి, పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవన్నారు. పేదింటిలో ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడిగా సీఎం కేసీఆర్, ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి ద్వారా సాయం చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖాన్లలోనే కాన్పు చేయిస్తున్నారని, కేసీఆర్ కిట్, రూ. 13వేలు అందించి, ఆంబులెన్స్‌లో ఇంటికి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్మన్ విజయ, టీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
సీఎంతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కొప్పుల ఈశ్వర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కోట్లాది రూపాయలను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సంఘాలకు వడ్డీలేని రుణాలు, బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులకు నెలనెలా పెన్షన్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూం ఇల్లు, తదితర పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. స్త్రీనిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.